'లోక్‌సత్తా' జేపీ రాయని డైరీ

'లోక్‌సత్తా' జేపీ రాయని డైరీ - Sakshi


ప్రజాస్వామ్యంలో ఏదీ ఎవరిదీ కాదు. యూపీఏ సోనియాది కాదు. ఎన్‌డీఏ మోదీది కాదు. టీఆరెస్ కేసీఆర్‌దీ కాదు. పైన ఉన్నది ఏదైనా కింది వరకు అందరికీ చెందాలి. టీవీలో ఓ యాడ్ చూశాను. ‘ఎక్స్‌క్యూజ్ మీ.. మీరేదైతే తింటున్నారో దాన్నే నన్ను కూడా తిననివ్వండి’ అంటాడు అతను ఆమెతో. బహుశా ఆమె.. చాక్లెట్ బార్ లాంటిదేదో తింటూ ఉంటుంది. అదీ ప్రజాస్వామ్యం అంటే! అది కూడా పూర్తి ప్రజాస్వామ్యం కాదు. హాఫ్ డెమోక్రసీ. ‘తిననివ్వండి’ అని అడగడం పోరాటం. ‘తినిపెట్టండి’ అని ఇవ్వడం సామ్యవాదం. రెండూ కలిస్తేనే పూర్ణ ప్రజాస్వామ్యం.





పాలిటిక్స్ నుంచి ‘లోక్‌సత్తా’ను ఎత్తేసి వారం అవుతోంది. మొత్తుకున్నవాళ్లు ఒక్కరూ లేరు. ‘ఎత్తేయడం ఏంటి?’ అని పాపం ఒకరిద్దరూ మాత్రం ఆశ్చర్యంగా అడిగారు. ‘పార్టీ ఉంటుంది. ఫైట్ చేసేవాళ్లు ఉంటారు. ఎలక్షన్స్‌కి మాత్రం వెళ్లం’ అని చెప్పాను. వాళ్లింకా ఆశ్చర్యంగానే చూస్తున్నారు. ఏదైనా ఉంటేనే కదా ఎత్తేయడానికి వీలౌతుంది. లేనిదాన్ని ఎలా ఎత్తేస్తారని వాళ్ల సందేహం! లోక్‌సత్తా ఈ పదేళ్లలో ప్రజల్లోకి వెళ్లిందా? ప్రజలకు దూరంగా వెళ్లిందా? ఫైల్స్ తిరగేయాలి. లోపల అన్నీ జీవోలే ఉంటాయేమో! ప్రజలకు హామీలు తప్ప జీవోలు అర్థం కావు. హామీలు ఇవ్వకుండా చేయించుకొచ్చిన జీవోలు అసలే అర్థం కావు.



ఒక్కొక్కరూ వచ్చి పరామర్శిస్తున్నారు! అరె, ఏం జరిగిందని? పార్టీ ఆఫీస్ నుంచి ఫామ్ హౌస్‌కి వచ్చినట్టు, పాలిటిక్స్ నుంచి పబ్లిక్‌లోకి వచ్చాను. అంతే కదా! పవన్ కల్యాణ్ ఒప్పుకోవడం లేదు. ‘ఇది కరెక్టు కాదేమో జేపీజీ’ అంటున్నాడు. ‘పోనీ కరెక్ట్ అయిందేదో నువ్వు చెప్పు కల్యాణ్’ అన్నాను. ఏమీ మాట్లాడలేదు. బెరుగ్గా చూశాడో, కరుగ్గా చూశాడో గానీ గుడ్లురిమి చూశాడు. ‘లోక్‌సత్తా జెండాలో స్టార్ ఉంది. జనసేన జెండాలో స్టార్ ఉంది. పాలిటిక్స్‌లో మాత్రం మన స్టార్‌డమ్ లేదు. మీ సత్తా తగ్గినట్టే.. నా సేనా తగ్గిపోదు కదా జేపీజీ..’ అన్నాడు కల్యాణ్. ఇంకోమాట కూడా అన్నాడు. ‘మీరిలా సడెన్‌గా పాలిటిక్స్ నుంచి బయటికి రావడం చూస్తే నాకేదో సందేశాన్నో, సంకేతాన్నో ఇస్తున్నట్లుంది’ అన్నాడు.



నిజమే!! ‘ప్రశ్నిద్దాం రండి’ అని నేను పాలిటిక్స్‌లోకి వెళ్లాను. ‘ప్రశ్నించండి పొండి’ అని కల్యాణ్ పాలిటిక్స్‌లోకి వచ్చాడు. జనం ప్రశ్నించడం లేదు. సమాధానం అడగడం లేదు. టీవీల్లో బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు చూస్తూ ఏడాదంతా హ్యాపీగా గడిపేస్తున్నారు. సినిమాల్లో నటించలేక కల్యాణ్‌కి, పాలిటిక్స్‌లో జీవించలేక నాకు అలసట వస్తోంది. ఇద్దరం ఒకే పడవలో ఉన్నట్లున్నాం. ‘అదే బెటర్ జేపీజీ.. ఒకళ్లం రెండు పడవల మీద లేకుండా’ అనేసి వెళ్లిపోయాడు కల్యాణ్.



తర్వాత రాజమౌళి వచ్చాడు. సిరివెన్నెల సీతా రామశాస్త్రి వచ్చారు. రాజకీయాలను సంస్కరించ డానికి వచ్చి రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏంటని వాళ్లిద్దరూ ప్రశ్నించారు. నవ్వాను. ప్రజాస్వా మ్యంలో ఏదీ ఎవరిదీ కాదు. జేపీ లేనంత మాత్రాన లోక్‌సత్తా లేనట్టు కాదు. జేపీకి సత్తా లేనట్టూ కాదు.



- మాధవ్ శింగరాజు

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top