హమీద్ అన్సారీ రాయని డైరీ | unwritten dairy of hameed ansari by madhav singaraju | Sakshi
Sakshi News home page

హమీద్ అన్సారీ రాయని డైరీ

Jan 24 2016 2:50 AM | Updated on Sep 3 2017 4:10 PM

హమీద్ అన్సారీ రాయని డైరీ

హమీద్ అన్సారీ రాయని డైరీ

మనుషులు మనుషుల్లో ఉండాలి. అదే ఆరోగ్యం. దేశాలు దేశాలతో ఉండాలి. అదే అభివృద్ధి. ఆరోగ్యం కోసం, అభివృద్ధి కోసం మనుషులు, దేశాలు ఎంత దూరమైనా ప్రయాణించాలి.

మనుషులు మనుషుల్లో ఉండాలి. అదే ఆరోగ్యం. దేశాలు దేశాలతో ఉండాలి. అదే అభివృద్ధి. ఆరోగ్యం కోసం, అభివృద్ధి కోసం మనుషులు, దేశాలు ఎంత దూరమైనా ప్రయాణించాలి. పది రోజుల క్రితంనాటి కేరళ గాలులు హత్తుకొమ్మని నన్నింకా హాంట్ చేస్తూనే ఉన్నాయి.. ఢిల్లీ వరకూ నా వెంటే వచ్చి! ఈసారి ఇంకాస్త పెద్ద ప్రయాణం. ముందు బ్రూనై. తర్వాత థాయ్. వచ్చేవారమే ప్రయాణం.

 

‘వెళ్లగలరా హమీద్‌జీ’ అన్నారు సుష్మా స్వరాజ్. ప్రయాణాలు ఎవరికి మాత్రం ఇష్టం ఉండవు? మదిలో కదలిక  లేకున్నా, మొదలయ్యాక ఏ ప్రయాణమైనా ఆహ్లాదకరంగానే ఉంటుంది. పూర్తయ్యాక ఏ ప్రయాణమైనా జీవితానికి ఒక మంచి జ్ఞాపకాన్ని ముద్దులా ఇచ్చి వెళుతుంది.

 

‘భారత ఉప రాష్ట్రపతి ఒకరు బ్రూనై వెళ్లడం ఇదే మొదటిసారి హమీద్‌జీ’ అన్నారు సుష్మా స్వరాజ్. థాయ్‌లాండ్‌కైతే గత యాభై ఏళ్లలో మనదేశం నుంచి ఒక్క ఉప రాష్ట్రపతి కూడా వెళ్లలేదట. ‘‘తూర్పు దేశాలకు వెళ్లిరావడం ఒక పాలసీగా పెట్టుకున్నాం హమీద్‌జీ. పాలసీ అంటే చుట్టపుచూపుగా వెళ్లిరావడం కాదు, ‘మీరెంత దూరంలో ఉన్నా మా ఇరుగూపొరుగువారే’ అని చెప్పి రావడం. మీరు కూడా ఈస్ట్‌కొకసారి వెళ్లొస్తే బాగుంటుంది’’ అని ఫ్లయిట్ టికెట్లు తెప్పించారు సుష్మాజీ.

 

‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ సుష్మదే. మునుపు ‘లుక్ ఈస్ట్ పాలసీ’ ఉండేది. అది పీవీ పాలసీ. తర్వాత వాజపేయి, మన్మోహన్ దానిని కంటిన్యూ చేశారు. కానీ లుక్ ఈస్ట్‌కీ, యాక్ట్ ఈస్ట్‌కీ తేడా ఉంది. గాంభీర్యపు గుబురు మీసాల కరచాలనాలకీ, ఆత్మీయపు ఆలింగనాల చిరునవ్వులకు ఉన్నంత తేడా.

 

బ్రూనైకి ఇక్కడి నుంచి రెండువేల ఆరొందల మైళ్లు. థాయ్‌కి పదిహేనొందల మైళ్లు. ఇంతింత దూరాలు ప్రయాణిస్తున్నప్పుడు నాకు జెరోనిమో గుర్తొస్తాడు. అతడు అన్నమాట గుర్తొస్తుంది. ‘దగ్గరవడం కోసం ఈ నాగరికులు ఎంత దూరమైనా వస్తారు’ అంటాడు జెరోనిమో! పందొమ్మిదో శతాబ్దపు అమెరికా ఆదివాసీ యోధుడు అతడు. ‘మా ఆదివాసీ అపాచీల గుండెకాయలు మా దేహాలలో కాకుండా మా భూముల లోపల కొట్టుకుంటుంటాయి. నాగరిక దురాక్రమణదారులు కాలు పెడితే అవి మందుపాతరలై పేలుతాయి’ అంటూ జీవితాంతం పోరుబాటలో ప్రయాణించినవాడు జెరోనిమో.

 

నాగరికుల మీద అపనమ్మకం జెరోనిమోకు. కుట్రేదో మనసులో పెట్టుకుని కాలినడకనైనా వచ్చేస్తారని. దేశాలకూ అలాంటి అపనమ్మకాలు ఉంటాయి. వాటిని పోగొట్టడమే ఇవాళ్టి నాగరికత. నమ్మకం కలిగించడానికి గానీ, నమ్మకం ఏర్పరచుకోడానికి గానీ.. మనిషైనా, దేశమైనా నిరంతరం ప్రయాణిస్తూనే ఉండాలి. ప్రయాణాలు మనుషుల్ని మనుషుల్లో ఉంచుతాయి. దేశాలను దేశాల్లో కలిపేస్తాయి.

 

- మాధవ్ శింగరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement