ధరల పెరుగుదల గురించి అటు కేంద్ర ప్రభుత్వంగాని రాష్ట్ర ప్రభుత్వంగాని పట్టించుకోకపోవటంతో నిత్యావసరాల ధరలు చాపకింద నీరులా రోజురోజుకి పెరిగిపోతున్నాయి.
ధరల పెరుగుదల గురించి అటు కేంద్ర ప్రభుత్వంగాని రాష్ట్ర ప్రభుత్వంగాని పట్టించుకోకపోవటంతో నిత్యావసరాల ధరలు చాపకింద నీరులా రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలతో బిజీబిజీగా గడుపుతూ ఉంటే మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం కోసమంటూ జపాన్, సింగపూర్ పర్యటనలతో తీరిక లేకుండా ఉన్నారు.
ఈ నేపథ్యంలో దళారులు, వ్యాపారస్తులు ఎవరి ఇష్టానుసారంగా వారు నిత్యావస రాల ధరలు పెంచుకుంటూపోతున్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగి నప్పుడు ఆటోల నుండి ఆర్‌టీసీ బస్‌ల వరకు అన్ని సేవల చార్జీలు వెనువెంటనే పెంచుకుంటూ పోయారు. మరి ఇప్పుడు చమురు ధరలు అంతర్జాతీయంగా భారీస్థాయిలో పడిపోయినప్పుడు గతంలో పెంచిన ఆ సేవల ఛార్జీలను తగ్గించడానికి ప్రభుత్వాలు ఏ మాత్రం కృషి చేయడం లేదు. చమురు ధరలు పెరిగినా, తగ్గినా సేవల విషయంలో ప్రజలపై పెరిగిన ఆ భారాన్ని అలాగే ఉంచి ప్రజల్ని నిలువునా దోచుకోవడం సబబుకాదేమో... ప్రభుత్వాలు కాస్త ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకొని ప్రజలకు మేలు చేయాలని మనవి.
పి. శ్రీవాణి రామవరప్పాడు, కృష్ణా జిల్లా