
ఆ 1,27,000కోట్ల రూపాయల ఊసెత్తరేం?
యథాప్రకారం జగన్‌పై సోమవారం నాలుగు పేజీల నిండా విషం కక్కిన ‘ఈనాడు’ ఒక పేజీ నిండా మాత్రం చంద్రబాబు ఇచ్చిన వ్యవసాయ రుణాల మాఫీ హామీని ఊదరగొట్టేసింది. అధికారంలో ఉండగా కరవుతో అల్లాడి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు రుణం కదు కదా... కనీసం వడ్డీని కూడా మాఫీ చేయలేదు.
ఫుల్‌పేజీ రాసి.. రుణాల మొత్తం ఎంతో చెప్పరేం రామోజీ?
అధికారంలో ఉండగా బాబు రుణాలు కాదు కదా...కనీసం వడ్డీ అయినా మాఫీ చేశారా?
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకున్నారా?
ఎన్నాళ్లిలా జనాన్ని మీ రాతలతో మోసం చేస్తారు?
యథాప్రకారం జగన్‌పై సోమవారం నాలుగు పేజీల నిండా విషం కక్కిన ‘ఈనాడు’ ఒక పేజీ నిండా మాత్రం చంద్రబాబు ఇచ్చిన వ్యవసాయ రుణాల మాఫీ హామీని ఊదరగొట్టేసింది. అధికారంలో ఉండగా కరవుతో అల్లాడి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు రుణం కదు కదా... కనీసం వడ్డీని కూడా మాఫీ చేయలేదు. అలాంటి బాబు ఇప్పుడు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తాననటం, దానికి ‘ఈనాడు’ తందాన పలకటం. ఇంతా చేసి... ఆ రుణాల మొత్తం ఎంతన్న సంగతి ఎక్కడైనా రామోజీ చెబితే ఒట్టు. నిజానికి రుణాలకు సంబంధించి ప్రతి ఏటా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం జరుగుతుంది. దీన్లో అన్ని బ్యాంకులూ కలసి ఏ రుణాలు ఎంత ఉన్నాయనే విషయాన్ని చెబుతాయి. పెపైచ్చు ఆ ఏడాది ఎంత రుణాలివ్వాలనుకుంటున్నారు... అనే విషయాలను కూడా వెల్లడిస్తాయి. ఇటీవలే జరిగిన 182వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశం ప్రకారం వ్యవసాయ రంగంలో నిరర్ధక ఆస్తులు, రావాల్సిన బకాయిలు కలిపి ఏకంగా రూ.1,27,546 కోట్లు... అక్షరాలా లక్షా ఇరవైఏడు వేల ఐదువందల నలభై ఆరు కోట్లున్నాయి. ఇవన్నీ వ్యవసాయ రుణాలే. మరి మేనిఫెస్టోలో వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు... ఈ రూ.1.27 లక్షల కోట్ల రుణాలను ఎలా మాఫీ చేస్తారు?
దీనిపై ఎన్నికల కమిషన్ ఇప్పటికే నోటీసులు జారీ చేసినా సమాధానం ఇవ్వలేదెందుకు? అయినా ఈసీ కన్నా ముందు రైతులకు ఆ వివరణ చెప్పాలిగా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వయం సహాయక సంఘాల్లో మహిళల రుణాల్ని మాఫీ చేస్తానని హామీ ఇవ్వటమే కాక... ఆ మొత్తం ఎంత ఉందో, దాన్ని ఎలా అమలు చేయాలనుకుంటున్నది సమగ్రంగా వివరించింది. మరి బాబు దీనిపై మొహం చాటేస్తున్నారెందుకు? అసలు మన బడ్జెట్ ఎంత? హామీ ఇస్తున్న మొత్తమెంత? ఎలా దీన్ని అమలు చేస్తాం? అనే కాసింత జ్ఞానమైనా చంద్రబాబుకు గానీ, రామోజీరావుకు గానీ ఉందా? జగన్ హామీలు ఆచరణలో అసాధ్యమంటూ రోజూ పేజీలకు పేజీలు రాస్తున్న రామోజీరావు... వాస్తవాలకు వీసమెత్తు కూడా విలువివ్వటం లేదెందుకు? ఎన్ని అబద్ధాలు చెప్పి అయినా తన చంద్రబాబును గెలిపించుకోవాలన్న ఆయన బాధ చూస్తుంటే ఎవరికైనా జాలి కలగటం ఖాయం. ఎందుకంటే ఈ సమాజం పిచ్చివాళ్లపై ఎన్నడూ ఆగ్రహం చూపించదు. సానుభూతి మాత్రమే వ్యక్తం చేస్తుంది.