
‘ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ’
బెంగళూర్ : ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై యడియూరప్ప నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ఆదివారం సీబీఐ విచారణకు ఆదేశించింది. గతంలో హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్- కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ బీజేపీ నేతలు, సీనియర్ పోలీస్ అధికారుల ఫోన్లను ట్యాపింగ్ చేసిందనే ఆరోపణల నిగ్గుతేల్చేందుకు యడియూరప్ప ప్రభుత్వం సీబీఐ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. గతంలో ఎవరెవరి ఫోన్లు ఏ కారణం చేత ఏ సమయంలో ట్యాప్ చేశారనే వివరాలు రాబట్టేందుకు కేసును సీబీఐకి అప్పగించినట్టు ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారని కర్ణాటక ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు.
మరోవైపు అంతర్జాతీయ ఏజెన్సీతో విచారణకైనా తాను సిద్ధమేనని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పందించారు. సీబీఐ విచారణ లేదా అంతర్జాతీయ ప్రమాణాలతో మరే విచారణనైనా వారు చేపట్టనివ్వండి..ట్రంప్‌తో అయినా మాట్లాడుకోనివ్వండంటూ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను తోసిపుచ్చుతూ వ్యాఖ్యానించారు.