పరుగుకు సిద్ధమైన 'ఫెయిరీ క్వీన్‌'

పరుగుకు సిద్ధమైన 'ఫెయిరీ క్వీన్‌'

ప్రపంచంలోనే అత్యంత పురాతన స్టీమ్‌ ఇంజిన్‌ రైలు 'ఫెయిరీ క్వీన్‌' మరోసారి పట్టాలపై పరుగుపెట్టేందుకు సిద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి హర్యానాలో గల రెవారీ స్టేషన్ల మధ్య ఫెయిరీ క్వీన్‌ పరుగు తీయనుంది. ప్రపంచంలో స్టీమ్‌ ఇంజిన్‌తో పనిచేస్తున్న రైళ్లలో ఫెయిరీ క్వీన్‌ ఆఖరిది. ప్రపంచవ్యాప్తంగా స్టీమ్‌ ఇంజిన్‌ రైలు ప్రేమికులు ఫెయిరీ క్వీన్‌ను ఎక్కేందుకు ఉవ్విళ్లూరేవారు. దాదాపు ఐదు సంవత్సరాల విరామం తర్వాత ఒక రోజు పరుగుకు(ఈ  నెల 11న) ఫెయిరీ క్వీన్‌ సిద్ధమైంది. 1855లో కిట్సన్‌, థాంప్సన్‌, హ్వీవిట్సన్‌ అనే ముగ్గురు ఇంగ్లాండ్‌లోని లీడ్స్‌లో ఫెయిరీ క్వీన్‌ను తయారు చేశారు. అదే ఏడాది ఫెయిరీ క్వీన్‌ ఇంగ్లాండ్‌ నుంచి అప్పటి కలకత్తాకు వచ్చింది.

 

1895 వరకూ హౌరా-రాణీగంజ్‌ల మధ్య నడిచిన ఫెయిరీ క్వీన్‌ను ఫ్లీట్‌ నంబర్‌ '22'గా పిలిచేవారు. ఆ తర్వాత బీహార్‌లో కూడా కొద్దికాలం పాటు పరుగులు తీసింది. దాదాపు 40 సంవత్సరాల పాటు చాణక్యపురిలో గల నేషనల్‌ రైల్‌ మ్యూజియంలో ఫెయిరీ క్వీన్‌ను ప్రదర్శనకు ఉంచారు. 1997లో మరోమారు మరమ్మత్తులు చేసి పట్టాలెక్కించారు. 1998లో వాడకంలో ఉన్న అత్యంత పురాతన స్టీమ్ ఇంజిన్‌ రైలుగా ఫెయిరీ క్వీన్‌ గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లోకి చేరింది. అదే ఏడాది అప్పటి ప్రధానమంత్రి అటల్‌ బీహారీ వాజ్‌పేయి మోస్ట్‌ ఇన్నోవేటివ్‌ అండ్‌ యూనిక్‌ టూరిజం ప్రాజెక్టు కింద ఫెయిరీ క్వీన్‌కు జాతీయ టూరిజం అవార్డును బహుకరించారు.





Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top