వేలం వెర్రిగా మగవాళ్ల సౌందర్య ఉత్పత్తులు

Indian men lap up grooming products - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గతంలో ఆడపిల్లల్ని ఆకర్షించడం కోసం పురుష పుంగవులు నెత్తికింత నూనె పెట్టుకొని ముఖానికి ఇంత పౌడరేసుకొని వీధుల్లోకి వెళ్లేవారు. ఆ తర్వాత నీటుగా గడ్డం గీసుకొని లేదా ట్రిమ్ముగా గడ్డం చేసుకొని, తెల్లగా పౌడరేసుకొని ‘షి’కారుకెళ్లేవారు. అప్పట్లో అందంగా కనిపించడం కోసం ఆడవాళ్లు వాడే సౌందర్య ఉత్పత్తులనే వాడేవారు. ఆ తర్వాత పరిస్థితులతోపాటు సౌందర్య ఉత్పత్తులు మారిపోయాయి. ఆడవారి సౌందర్య ఉత్పత్తులతోపాటు మగవారి కోసం ప్రత్యేక సౌందర్య ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు ఈ ఉత్పత్తులు మార్కెట్లో దుమ్ము రేపుతున్నాయని, వాటి మార్కెట్‌ ఇప్పుడు ఏటా ఐదు వేల కోట్ల రూపాయలకు చేరుకుందని ‘నీల్సన్‌’ డిసెంబర్‌17 పేరిట విడుదల చేసిన ఓ సర్వే నివేదికలో వెల్లడించింది. 

పురుషులు ఇంత వేలం వెర్రిగా సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తున్నది ఆడపిల్లలను ఆకర్షించడానికి కాదట. ఉద్యోగం చేస్తున్న చోట నీట్‌గా కనిపించి మంచి మార్కులు కొట్టేయటానికట. ఆడపిల్లలకు అందంగా కనిపించాలని వెంటబడేది పెళ్లయ్యేంత వరకేగదా! గతంలో మగవాళ్ల అందం కోసం షేవింగ్‌ జెల్, షేవింగ్‌ క్రీమ్‌లతోపాటు ఆఫ్టర్‌ షేవ్‌ లోషన్లు, డియోడోరాంట్స్‌ మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ప్రత్యేక షాంపూలు, నూనెలు, ఫెయిర్‌నెస్‌ క్రీమ్స్, బియర్డ్‌ బామ్స్, మత్తునిచ్చే సెంట్స్‌ ఎన్నో మార్కెట్‌లోకి వచ్చాయి. ఆరేడేళ్ల క్రితంతోని ఇప్పుడు పోలిస్తే వీటి వినియోగం ఊహించలేనంత పెరిగింది. 2009 నుంచి 2016 మధ్య పురుష సౌందర్య ఉత్పత్తుల మార్కెట్‌ను 60 రెట్లు పెరిగిందని నీల్సన్‌ సర్వే తెలియజేసింది. 

ఈ ఉత్పత్తుల్లో హిందుస్థాన్‌ లీవర్, ఎల్‌ వోరియల్, నీవియా, మారికో కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ ఉత్పత్తులకు 2017 సంవత్సరం బాగా కలసివచ్చిందని చెప్పవచ్చు. సెట్‌వెట్‌ హేర్‌ జెల్‌ను విక్రయిస్తున్న ముంబై కంపెనీ మారికో గత మార్చి నెలలో బియర్డో కంపెనీలో 45 శాతం వాటాను కొనుగోలు చేసింది. కోల్‌కతాలోని ఎమామి కంపెనీ గత డిసెంబర్‌ నెలలో ‘ది మేన్‌ కంపెనీ’లో 30 శాతం వాటాను కొనుగోలు చేసింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top