ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం?

Which is Right and Wrong - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఒకపక్క వర్షాభావం, మరో పక్క భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు అతలాకుతలం అవుతుండం, అన్నార్థులు, అభాగ్యులు అకారణంగా మత్యువాత పడుతుండడం పర్యావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులే కారణమని శాస్త్రవేత్తలు నెత్తి, నోరు మొత్తుకొని చెబుతున్న విషయం విషయం తెల్సిందే. ప్రధానంగా చెట్లను కాపాడుకోలేకపోవడం వల్ల దేశంలో అటవీ ప్రాంతం తగ్గిపోయి కార్బన్‌డై ఆక్సైడ్‌ పెరిగి భూతాపోన్నతి పెంచడం వల్ల ఈ అకాల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పర్యావరణ పరిస్థితుల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నానని అంతర్జాతీయ వేదికల ముందు బాకా ఊది మరి చెబుతున్న భారత్‌లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దొంగ లెక్కలూ ఉన్నాయి. 

భారత్‌లో 2005 నుంచి 2017 సంవత్సరాల మధ్య 2,152 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం (వక్ష సంపద) విస్తరించిందని ‘ది ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా’ గతంలో ఓ డేటాను విడుదల చేసింది. వాస్తవానికి 2001 నుంచి 2018 సంవత్సరాల మధ్య భారత్‌లో 16 లక్షల హెక్టార్లలో వృక్ష సంపద నాశనం అయిందని యూనివర్శిటీ ఆఫ్‌ మేరిలాండ్, గూగుల్, యూఎస్‌ జియోలోజికల్‌ సర్వే, నాసాలు సేకరించిన డేటా, ఛాయా చిత్రాలను అధ్యయనం చేయడం ద్వారా లాభాపేక్ష లేని ‘వరల్డ్‌ రిసోర్సెస్‌ ఇనిస్టిట్యూట్‌’ అనే స్వచ్ఛంద సంస్థ తాజాగా వెల్లడించింది. 

భారత్‌ ప్రభుత్వం దేశంలో వృక్ష సంపద పెరగిందంటే ‘వరల్డ్‌ రిసోర్సెస్‌ ఇనిస్టిట్యూట్‌’ తగ్గిందని చెబుతున్నది ఇందులో ఏది సబబు, ఏది కాదు ? దేశంలో అటవి ప్రాంతం విస్తరించిందని చెబుతున్న అటవీ సర్వే మరోపక్క తరుగుతున్న అటవీ ప్రాంతాన్ని లెక్కలోకి తీసుకోలేదా? గనులు, వివిధ ప్రాజెక్టుల కారణంగా దేశంలో వక్ష సంపద తగ్గిపోతోందంటూ ప్రజాందోళన పెరుగుతున్న నేపథ్యంలో వక్ష సంపద పెరిగిందనడం వారిని బుజ్జగించడం కోసమా? కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు అలా ప్రకటించిందా ? ఇక్కడ మరో అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే ఏది వాస్తవమో, ఏది అబద్ధమో! ఇట్టే తెలిసిపోతుంది. 

2030 సంవత్సరం నాటికల్లా భూవాతావరణంలో 250 టన్నుల నుంచి 300 టన్నుల వరకు కార్బన్‌డై ఆక్సైడ్‌ను తగ్గించేందుకు సరిపడా వృక్ష సంపదను పెంచుతామని, అందుకోసం అటవులను అభివద్ధి చేస్తామని 2015, డిసెంబర్‌లో పారిస్‌లో పర్యావరణ పరిస్థితులపై జరిగిన అంతర్జాతీయ సమావేశంలో తీర్మానంపై భారత ప్రభుత్వం సంతకం చేసింది. ఇందుకోసం 2030 సంవత్సరం నాటికి 60 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామంటూ ఉదారంగా హామీ కూడా ఇచ్చింది. 2015–16, 2016–17 ఆర్థిక సంవత్సరాలకు కేవలం 89.53 కోట్ల రూపాయలను, 2017–18 ఆర్థిక సంవత్సరానికి 47.8 కోట్ల రూపాయలను కేటాయించినట్లు పార్లమెంటరీ కమిటీ నివేదికనే వెల్లడించింది. అంటే పారిస్‌ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత ఈ మూడేళ్ల కాలంటో 136 కోట్లను మాత్రమే కేటాయించిన కేంద్ర ప్రభుత్వం రానున్న 12 ఏళ్ల కాలంలో 60 వేల కోట్లలో ఎన్నికోట్లను కేటాయించగలదు? 

ఒకప్పుడు పండుగలకు, పబ్బాలకు, పిల్లలు పుడితే వారి మీద చెట్లను నాటి, వాటిని పిల్లలతో సమానంగా చూసుకునే సంస్కతి ప్రజల్లో ఉండేది. అది అంతరించడంతో చెట్లు నాటేందుకు ఎక్కడికక్కడ ప్రభుత్వాలే ముందుకు వచ్చాయి. వస్తున్నాయి. అన్నింట్లో అవినీతికి అలవాటుపడ్డ ప్రభుత్వాల వల్ల చెట్లు ఊపిరిపోసుకోవడం లేదు. ఇక అడవులను పెంచడం తమ వల్ల కాదన్న అభిప్రాయానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వం అడవుల పెంపకం బాధ్యతలను కార్పొరేట్లకు ఇవ్వాలంటూ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. దీనిపై విస‍్తృతంగా చర్చ జరపాలని కోరుకుంటోంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top