త్వరలో బీసీ కమిషన్‌కు హోదా | Sakshi
Sakshi News home page

త్వరలో బీసీ కమిషన్‌కు హోదా

Published Thu, Aug 10 2017 2:03 AM

త్వరలో బీసీ కమిషన్‌కు హోదా

► కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా లభిస్తుందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా బిల్లు, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేలా కేంద్రం చొరవ తీసుకోవాలని కోరుతూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ బుధవారం దత్తాత్రేయను కలసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఓబీసీ కమిషన్‌ బిల్లుకు రాజ్యసభలో ప్రతిపక్షాలు అడ్డుతగలకపోతే ఎప్పుడో ఆమోదం పొందేదన్నారు.

సవరణల పేరుతో లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును రాజ్యసభలో విపక్ష పార్టీలు అడ్డుకున్నాయని విమర్శించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు ఉభయసభల్లో ఆమోదం పొందుతుందని, ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి థావర్‌చంద్‌ గెహ్లట్‌ తనకు స్పష్టం చేశారని దత్తాత్రేయ తెలిపారు. బీసీల అభ్యున్నతికి దత్తాత్రేయ తీసుకుంటున్న చొరవకు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement