స్వదేశానికి రాక.. కరోనా పాజిటివ్‌

Two Indians Back From Gulf To Kerala Test Coronavirus Positive - Sakshi

తిరువనంతపురం : కరోనాపై పోరులో విజయం దిశగా అడుగులు వేస్తున్న కేరళను మరొ కొత్త భయం వెంటాడుతోంది. గడిచిన వారం రోజులుగా కనీసం ఒక్క కరోనా పాజిటివ్‌ కూడా నమోదు కాని రాష్ట్రంలో తాజాగా వైరస్‌ భయాందోళనకు గురిచేస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ముందే ఊహించిన విధంగా విదేశాల నుంచి వచ్చిన వారు కొత్త సమస్యను తెచ్చిపెడుతున్నారు. దుబాయ్‌ నుంచి 363 మంది ప్రయాణికులతో కేరళ రాజధాని తిరువనంతపురంకు గురువారం తొలి విమానం చేరిన విషయం తెలిసిందే. అయితే వీరిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. వీరికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మిగతా ప్రయాణికల అందరినీ కోజికోడ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారెంటైన్‌ సెంటర్లో ఉంచారు. కాగా గల్ఫ్‌ దేశాల నుంచి మరో 698 మంది కొచ్చికి రానున్నారని కేరళ ప్రభుత్వం తెలిపింది. (స్వదేశానికి తరలింపు.. పెను ప్రమాదం!)

దీనిపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ.. రానున్న 100 రోజులు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. విదేశాల నుంచి వచ్చే వారితో వైరస్‌ ప్రమాదం పొంచి ఉందని, వారందరికి పరీక్షలు నిర్వహించి క్వారెంటైన్‌లో ఉంచేందుకు ఏర్పాటు చేశామన్నారు. కాగా కరోనా కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే మే 7న తొలి విమానం విదేశాలకు బయలుదేరింది. మొత్తం 13 దేశాల నుంచి ప్రత్యేక విమానాలు, నేవీ ద్వారా భారతీయులను స్వదేశానికి తరలిస్తున్నారు. కువైట్‌ నుంచి తొలి విమానం హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ విమానాశ్రయానికి శనివారం రానుంది. దీనిలో మొత్తం 251 మంది రానున్నారు. వీరిలో తెలుగు వారే ఎ‍క్కువగా ఉన్నారు. (లాక్‌డౌన్‌: 14,800 మంది భారత్‌కు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top