లాక్‌డౌన్‌: 14,800 మంది భారత్‌కు..

India Evacuation Plan During Lockdown 14800 Indians On 64 Flights - Sakshi

13 దేశాలు.. 64 విమానాలు.. 14,800 మంది ప్రయాణికులు

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువచ్చేందుకు రంగం సిద్ధమైంది. వాయు, సముద్ర మార్గాల ద్వారా దాదాపు 14,800 మందిని భారత్‌కు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ మేరకు గురువారం నుంచి దశల వారీగా 64 విమానాలు, 3 నౌకల ద్వారా వారిని స్వదేశానికి చేరుస్తామని పేర్కొంది. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న తరుణంలో భారత్‌ నుంచి అమెరికా, ఫిలిప్పైన్స్‌, సింగపూర్‌, బంగ్లాదేశ్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, యూకే, సౌదీ అరేబియా, ఖతార్‌, సింగపూర్‌, ఒమన్‌, బహ్రెయిన్‌, కువైట్‌ తదితర 13 దేశాలకు విమానాలు బయల్దేరతాయని వెల్లడించింది. ఇక గురువారం నుంచి ప్రారంభం కానున్న ప్రక్రియలో తొలిరోజు 10 విమానాలల్లో దాదాపు 2300 మందిని భారత్‌కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.(లాక్‌డౌన్ ఉల్లంఘ‌న‌.. ఎమ్మెల్యే అరెస్ట్)

అదే విధంగా రెండో రోజు తొమ్మిది దేశాల నుంచి సుమారు 2050 భారతీయులు చెన్నై, కొచ్చి, ముంబై, అహ్మదాబాద్‌, బెంగళూరు, ఢిల్లీకి చేరుకోనున్నట్లు సమాచారం. మూడో రోజు మధ్య ప్రాచ్య దేశాలు, యూరప్‌, దక్షిణాసియా, అమెరికా నుంచి ముంబై, కొచ్చి, లక్నో, ఢిల్లీకి విమానాలు చేరుకుంటాయని ఓ వార్తా సంస్థ వెల్లడించింది. నాలుగో రోజు 1850 మంది స్వదేశానికి తిరిగి రానున్నారని పేర్కొంది. ఇక భారత నౌకా దళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ జలాశ్వ ద్వారా దాదాపు 1000 మందిని భారత్‌కు తీసుకురానున్నట్లు వెల్లడించింది. అదే విధంగా ఐఎన్‌ఎస్‌ శార్దూల్‌, ఐఎన్‌ఎస్‌ మగర్‌ ట్రిప్పునకు 300 మంది చొప్పున ప్రయాణీకులను చేరవేయనున్నట్లు పేర్కొంది. (చైనా కంటే ముందే ఆ దేశంలో కరోనా వైరస్‌!)

కాగా ప్రయాణానికి సిద్ధమైన వారు తమకు జ్వరం, దగ్గు, డయాబెటిస్‌, శ్వాసకోశ ఇబ్బందులు, కరోనాకు సంబంధించిన లక్షణాలు ఉంటే ముందుగానే సమాచారం ఇవ్వాలని.. అదే విధంగా తప్పనిసరిగా భౌతిక దూరం నిబంధనలు పాటించాలని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో కరోనా లక్షణాలు లేనివారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఇక కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో మార్చి నెల చివర్లో భారత్‌ అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో విదేశాల్లో చిక్కుకుపోయిన తమను భారత్‌కు తీసుకువెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేయడంతో.. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు దృష్ట్యా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే స్వదేశానికి వచ్చేందుకు అయ్యే చార్జీలను ప్రయాణీకులే భరించాల్సి ఉంటుంది. అదే విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ప్రయాణీకులు పాటించాల్సి ఉంటుంది. (క్వారంటైన్ ముగిసిన‌వారికి క‌రోనా పాజిటివ్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top