సీబీఐ వివాదం : సుప్రీంలో ముగిసిన వాదనలు

Supreme Court Reserves Order On Alok Vermas Plea - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో నెలకొన్న వివాదం నేపథ్యంలో తనను అకారణంగా ప్రభుత్వం సెలవుపై పంపడాన్ని సవాల్‌ చేస్తూ సీబీఐ చీఫ్‌ అలోక్‌ వర్మ, ఎన్జీవో కామన్‌ కాజ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్‌ చేశామని కోర్టు పేర్కొంది. సర్వోన్నత న్యాయస్ధానంలో ఈ కేసుపై గురువారం వాదనలు వినిపించిన కామన్‌ కాజ్‌ తరపు న్యాయవాది దుష్యంత్‌ దవే.. సీబీఐ చీఫ్‌గా వర్మ అధికారాలను కేంద్ర కత్తిరించడాన్ని తప్పుపట్టారు. సీబీఐ డైరెక్టర్‌ పదవి నిర్ణీత పదవీకాలంతో కూడుకుని ఉన్నందున దీనికి అఖిల బారత సర్వీస్‌ నిబంధనలు వర్తించవని కోర్టుకు నివేదించారు. అయితే అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ పరిష్కారాలను అన్వేషించాల్సి ఉంటుందని అంతకుముందు కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. అనూహ్య, అసాధారణ సందర్భాల్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వ జోక్యం అనివార్యమైందని విజిలెన్స్‌ కమిషన్‌ తరపు న్యాయవాది సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా పేర్కొన్నారు.

సీబీఐలో పరిస్థితులు ఈ ఏడాది జులైలోనే గాడితప్పడం ప్రారంభించాయని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ కోర్టుకు తెలిపారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌ స్పష్టం చేసింది. సెలక్షన్‌ కమిటీని సంప్రదించకుండానే సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ అధికారాలను కత్తిరించే అవసరం ఎందుకొచ్చిందని కోర్టు విజిలెన్స్‌ కమిషన్‌ను ప్రశ్నించింది. సీబీఐ ఉన్నతాధికారులు వర్మ, ఆస్ధానాల మధ్య రాత్రికి రాత్రే వివాదం చెలరేగలేదని పేర్కొంది.

సీబీఐ ఉన్నతాధికారులు కేసుల దర్యాప్తును గాలికొదిలేసి వారిద్దరి మధ్య కేసులపై విచారణ చేపడుతున్నారని మెహతా కోర్టుకు తెలిపారు. ఈ పరిణామాలను చక్కదిద్దాల్సిన పరిధి విజిలెన్స్‌ కమిషన్‌కు ఉందని, లేకుంటే భారత రాష్ట్రపతి, సుప్రీం కోర్టులకు సీవీసీ సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. సీబీఐ డైరెక్టర్‌పై విచారణ చేపట్టాలని ప్రభుత్వం నుంచి సిఫార్సు వచ్చిందని, విజిలెన్స్‌ కమిషన్‌ విచారణ ప్రారంభించినా నెలల తరబడి వర్మ సంబంధిత పత్రాలను ఇవ్వలేదని కోర్టుకు వివరించారు.

మరోవైపు ఈ కేసులో తమ క్లెయింట్‌ ముందస్తు హెచ్చరికలతో వ్యవస్థను మేలుకొల్పేందుకు ప్రయత్నించినా ప్రభుత్వం ఆయననూ అదే తరహాలో చూస్తోందని రాకేష్‌ ఆస్ధానా తరపు న్యాయవాది సీనియర్‌ అడ్వకేట్‌ ముకుల్‌ రోహ్తగీ వాదించారు. వర్మపై సీవీసీ విచారణను ప్రభుత్వం ముందుకుతీసుకువెళ్లాలని కోరారు. ఇక రాకేష్‌ ఆస్ధానా సహా సీబీఐ అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణల కేసులను కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని పిటిషనర్లు కోరారు. కాగా, ఈ కేసులో వాదనలు ముగిశాయని, తీర్పును రిజర్వ్‌లో ఉంచామని సుప్రీం బెంచ్‌ పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top