బెంగాల్‌ పోలీసులపై సుప్రీం కన్నెర్ర 

Supreme Court Fires On Bengal Police - Sakshi

బీజేపీ నేత ప్రియాంకను తక్షణం విడుదల చేయాలని ఆదేశం

న్యూఢిల్లీ/కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మార్ఫింగ్‌ ఫొటోను షేర్‌ చేసిన వ్యవహారంలో బెయిల్‌ ఇచ్చినప్పటికీ బీజేపీ నేత ప్రియాంక శర్మను జైలు అధికారులు విడుదల చేయకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెను వెంటనే విడుదల చేయకుంటే కోర్టు ధిక్కార నేరం కింద సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని బుధవారం హెచ్చరించింది. సుప్రీం హెచ్చరికల నేపథ్యంలో జైలు అధికారులు ఆమెను విడుదల చేశారు.

ప్రియాంక అరెస్ట్‌ వ్యవహారంలో పోలీసులు నిబంధనలను తుంగలో తొక్కారని ఈ సందర్భంగా జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాల ధర్మాసనం ప్రాథమికంగా అభిప్రాయపడింది. తదుపరి విచారణను జూలై నెలకు వాయిదా వేసింది. మమతా బెనర్జీ మార్ఫింగ్‌ ఫొటోను ఫేస్‌ బుక్‌లో షేర్‌చేయడంతో ప్రియాంకను మే 10న అరెస్ట్‌ చేశారు. దీంతో ప్రియాంక న్యాయ వాది సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే పశ్చిమబెంగాల్‌ జైలు అధికారులు ప్రియాంకను విడుదల చేయకపోవడంతో ఆమె సోదరుడు రజీబ్‌ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

తీవ్రంగా వేధించారు: ప్రియాంక
జైలులో ఉన్నప్పుడు అక్కడి అధికారులు తనను తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేశారని బీజేపీ నేత ప్రియాంక శర్మ ఆరోపించారు. కనీసం తాగటానికి నీళ్లు కూడా ఇవ్వకుండా, ప్రతీరోజూ జైలు గదులు మారుస్తూ హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘క్షమాపణలు అడగటానికి, విచారం వ్యక్తం చేయడానికి నేను ఏ తప్పూ చేయలేదు. జైలర్‌నాతో చాలా దురుసుగా ప్రవర్తించారు. ఓ నేరస్తుడిలా నన్ను జైలు గదిలోకి నెట్టారు. తీవ్రమైన ఎండలు కాస్తుంటే ఒకే గదిలో 40 మంది ఖైదీలను ఉంచారు. నా కుటుంబ సభ్యులు, న్యాయవాదితో మాట్లాడేందుకు కూడా అనుమతించలేదు. నేను విడుదల కావాలంటే ఓ కాగితంపై సంతకం పెట్టాలన్నారు. నాకు మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో అలాగే చేశాను’అని వాపోయారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top