నిర్భయ దోషి రివ్యూ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

Supreme Court begins hearing review petition of convict in Nirbhaya case - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషి అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ తనకు విధించిన మరణ శిక్షపై దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తీర్పుపై సమీక్ష కోరే హక్కు దోషికి ఉండబోదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిర్భయ దోషులకు ఉరిశిక్ష సరైనదని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదివరకే ఈ కేసులోని ముగ్గురు దోషులకు సంబంధించిన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇక, ఇవాళ (బుధవారం) మధ్యాహ్నం రెండుగంటలకు పటియాల హౌజ్‌ కోర్టులో నిర్భయ దోషులకు డెత్‌ వారెంట్ల జారీపై విచారణ జరగనుంది. తనకు విధించిన ఉరిశిక్షను పునఃసమీక్షించాలని నిర్భయ కేసులో దోషి అయిన అక్షయ్‌సింగ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అతని అభ్యర్థనపై త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరపాలని కోరినా.. పట్టించుకోలేదని, దర్యాప్తు అధికారుల అసమర్థత వల్ల ఈ కేసులో నిజమైన దోషులను పట్టుకోలేకపోయారని అక్షయ్‌కుమార్‌సింగ్‌ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు.

ఈ రివ్యూ పిటిషన్‌ విచారణ నుంచి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే సోమవారం తప్పుకున్న సంగతి తెలిసిందే. జస్టిస్‌ బాబ్డే, జస్టిస్‌ ఆర్‌ బానుమతి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మంగళవారం ఈ  పిటిషన్‌పై విచారణ జరపాల్సి ఉంది. అయితే, నిర్భయ తల్లి తరఫున విచారించిన లాయర్లలో తన బంధువు ఉన్నారని, అందుకే విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్‌ బాబ్డే ప్రకటించారు. దీంతో బుధవారం మరో బెంచ్‌ విచారణ చేపట్టింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top