ఏటా 18 లక్షల మందికి అకాల మరణం

Stronger Climate Action Improve India Air quality - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ నగరంలో కాలుష్యం తీవ్రమవడంతో స్కూళ్లకు అత్యవసర సెలవులు ప్రకటించారు. ఇంటి నుంచి బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాల్సిందిగా పిల్లలందరికి హెచ్చరికలు జారీ చేశారు. ఆఫీసుకెళ్లే ఉద్యోగులు సైతం కాలుష్యం నుంచి తట్టుకునేందుకు మెడికల్‌ మాస్క్‌లు ధరించాల్సిందిగా సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాతావరణంలో కాలుష్యం ఇంత ప్రమాదకరమైనదా?
ఇంతా అంతా కాదు భారత దేశంలో కాలుష్యం, ముఖ్యంగా వాయు కాలుష్యం కారణంగా ఏటా ఏకంగా 18 లక్షల మంది ఆయువు తీరకుండానే మరణిస్తున్నారని ‘లాన్‌సెట్‌’ మెడికల్‌ మాగజైన్‌ వెల్లడించింది. భారత దేశంలోనే కాలుష్యం మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత కాలుష్య నగరాలను గుర్తించగా, అందులో 14 నగరాలు భారత్‌లోనే ఉన్నాయి. వాటిల్లో ఢిల్లీ, వారణాసి, పట్నా నగరాలు అగ్రస్థానాల్లో ఉన్నాయి. పట్టణాల్లో కూడా మురికి వాడల్లో కాలుష్యం పరిస్థితి మరీ భయంకరంగా ఉంది. ఇప్పుడు కాలుష్యం భూతం ఒక్క భారత్‌నే కాకుండా ప్రపంచ దేశాలను, ముఖ్యంగా ఆసియా దేశాలను పట్టి పీడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా కాలుష్యం కారణంగా 70 లక్షల మంది మరణిస్తున్నారు. అంటే ధూమపానం సేవించడం వల్ల మరణించే వారి సంఖ్యకన్నా కాలుష్యం కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య పెరిగింది.

వాతావరణంలో పీఎం 2.5 (పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ 2.5 మిల్లీమీటర్ల) ధూళి కణాల వల్ల బ్రెయిన్‌ స్ట్రోక్, గుండె జబ్బులు, కాలేయం క్యాన్సర్‌ వచ్చి చనిపోతున్నారు. ధూళి కణాల వల్ల మెదడులో, గుండెలో రక్త నాళాలు చిట్లి పోతున్నాయని లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌ తెలియజేసింది. భారత్‌లో ఇంటిలోపల కూడా కాలుష్యం పెరుగుతోందని,  ఈ కాలుష్యం కారణంగా ఏటా 13 లక్షల మంది మరణిస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలో కట్టెలు, బొగ్గులను ఉపయోగించడం వల్ల, బయోగ్యాస్‌ వల్ల ఇంటిలో కాలుష్యం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరంగా కాలుష్యం పెరుగుతున్నందునే అక్టోబర్‌ 30వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక సదస్సును నిర్వహించింది.

దేశంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ‘పారిస్‌ ఒప్పందం’లో పేర్కొన్న అన్ని హామీలను అమలు చేయాలి. ముఖ్యంగా థర్మల్‌ పవర్‌ విద్యుత్‌ కేంద్రాల నుంచి జల విద్యుత్‌ కేంద్రాలు, సోలార్, పవన విద్యుత్‌ కేంద్రాల వైపు మళ్లాలి. వాహనాల కాలుష్యాన్ని తగ్గించాలి. దేశంలోని 57 థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించాల్సిందిగా ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం ఇక్కడ గమనార్హం. కాలుష్యానికి కారణం అవుతున్న డీజిల్, పెట్రోల్‌ కార్లకు క్రమంగా స్వస్తిచెప్పి ఎలక్ట్రిక్‌ వాహనాలవైపు మళ్లాలి. 2030కల్లా దేశంలో ఒక్క ఎలక్ట్రిక్‌ కార్లు మాత్రమే అమ్మకానికి ఉంటాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం ముదావహం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top