ఆ రైలుకు రెండు వైపులా ఇంజన్లు!

Special Rajdhani Train Has Engine At Both Ends - Sakshi

మనకు ఊహ తెలిసినప్పటి నుంచి రైలు అంటే ముందు ఒక ఇంజన్‌ ఉండి, తర్వాత బోగీలు ఉంటాయి. తాజాగా ఒక ట్రైన్‌కు మాత్రం రెండు వైపులా ఇంజన్లు అమర్చారు. పశ్చిమ రైల్వే ఈ ప్రయోగం చేసింది. బాంద్రా నుంచి ఢిల్లీలోని హజ్రత్‌నిజాముద్దీన్‌ వరకు వెళ్లే ప్రత్యేక రైలు రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు రెండు ఇంజిన్లు అమర్చారు. భారతీయ రైల్వే చరిత్రలో ప్రయాణికుల రైలుకు రెండు ఇంజిన్లు జతచేయడం ఇదే మొదటిసారి. దీని వల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాక, ప్లాట్‌ఫామ్‌పై రైలు వేగంగా కదిలేందుకు ఆ రెండో ఇంజన్‌ దోహదపడుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో పోల్చుకుంటే రెండు ఇంజిన్లు అమర్చిన ప్రత్యేక రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రెండు గంటల సమయం ఆదా అవుతుందన్నారు.

అయితే ఈ ప్రయోగాన్ని ఇంతకుముందు గూడ్స్‌ రైళ్లలో విజయవంతంగా ప్రయోగించారు. ప్రయాణికుల రైలులోనూ పుష్‌ అండ్‌ పుల్ టెక్నిక్‌(ముందు, వెనక ఇంజన్లు‌ అమర్చడం)ను ప్రవేశపెట్టాలని మధ్య రైల్వే (సెంట్రల్‌ రైల్వే) జనరల్‌ మేనేజర్‌ డి.కె. శర్మ ఆధ్వర్యంలో జరిగిన కమిటీ సమావేశంలో నిర్ణయించారు. దీంతో ప్రత్యేక రైలు రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు ఈ ప్రయోగాన్ని అమలు చేశారు. ‘వెనక వైపు ఇంజన్‌ను అమర్చినా... ముందువైపు ఇంజన్‌లో ఉన్న లోకో పైలటే రెండో దాన్ని కూడా ఆపరేట్‌ చేస్తాడు. వేగం, బ్రేకింగ్‌ విషయంలో లోకోమోటివ్స్‌ల మధ్య ఇంకా సాంకేతికతను అభివృద్ది పరచాల్సి ఉంద’ ని సెంట్రల్‌రైల్వే ప్రధాన ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో) రావినర్‌ భాకర్‌ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top