వాద్రా స్కామ్‌పై సిట్ వేయాల్సిందే | Robert Vadra land deals paralyse Parliament, BJP demands SIT probe | Sakshi
Sakshi News home page

వాద్రా స్కామ్‌పై సిట్ వేయాల్సిందే

Aug 14 2013 4:53 AM | Updated on Oct 22 2018 9:16 PM

వాద్రా స్కామ్‌పై సిట్ వేయాల్సిందే - Sakshi

వాద్రా స్కామ్‌పై సిట్ వేయాల్సిందే

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలు మంగళవారం పార్లమెంటు ఉభయ సభలను కుదిపేశాయి. వాద్రా స్కామ్‌లపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరపించాల్సిందేనంటూ ప్రతిపక్ష బీజేపీ పట్టుబట్టింది.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలు మంగళవారం పార్లమెంటు ఉభయ సభలను కుదిపేశాయి. వాద్రా స్కామ్‌లపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరపించాల్సిందేనంటూ ప్రతిపక్ష బీజేపీ పట్టుబట్టింది. లోక్‌సభ, రాజ్యసభల్లో ఈ అంశాన్ని పలుమార్లు లేవనెత్తిన ఆ పార్టీ సభ్యులు.. భూ కుంభకోణంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం దానికి తిరస్కరించింది. బీజేపీ పట్టువదలకపోవడంతో సభా వ్యవహారాలకు పదే పదే అంతరాయం కలిగింది. దీంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. ఈ విషయంలో బీజేపీకి ఇతర పార్టీల సభ్యులెవరూ మద్దతివ్వలేదు. యూపీఏకు బయటి నుంచి మద్దతిస్తున్న ఎస్పీ, బీఎస్పీలు మాత్రం కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచాయి. వాద్రా మీద ఆరోపణలపై సోనియాను తప్పు బట్టడం సరికాదని పేర్కొన్నాయి. వామపక్ష సభ్యులు మాట్లాడుతూ.. వ్యక్తులైనా, కార్పొరేట్ సంస్థలైనా.. ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే దానిపై విచారణ చేసి దోషులను శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశాయి. ఇలాంటి అంశాలను సభలో చర్చించాల్సిందేనన్నాయి.
 
 లోక్‌సభలో..: దిగువ సభలో బీజేపీ నేత యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ.. ‘‘డబ్బు సంపాదించే మార్గాలను చెప్పే బిజినెస్ స్కూళ్లు దేశంలో చాలా ఉన్నప్పటికీ.. అలాంటి స్కూళ్లకు వేటికీ వెళ్లకుండానే, పెట్టుబడి పెట్టకుండానే, వేలాది కోట్లమేర అనుచిత లబ్ధి పొందిన ప్రభావశీలి ఒకరున్నారు’’ అంటూ వాద్రాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు లేచి నిరసన తెలిపారు. బీజేపీ ఆరోపణలను నిరసిస్తూ సంజయ్ నిరుపమ్ వెల్‌లోకి దూసుకెళ్లారు. మొదటి వరుస బెంచీల్లో కూర్చొన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్, సహాయ మంత్రి రాజీవ్ శుక్లా కూడా లేచి నిలబడి నిరసన వ్యక్తంచేశారు. అయితే ‘‘కాంగ్రెస్ కా హాత్, దామాద్ కే సాత్’(కాంగ్రెస్ హస్తం.. అల్లుడి నేస్తం) అని బీజేపీ సభ్యులు నినాదాలు చేయగా.. ‘కాంగ్రెస్ కాహాత్, జనతా కే సాత్, గరీబ్ కే సాత్’(కాంగ్రెస్ హస్తం.. ప్రజల నేస్తం, పేదల నేస్తం) అంటూ అధికారపక్ష సభ్యులు నినదించారు.
 
 రాజ్యసభలో: ఎగువ సభలో ఈ అంశాన్ని బీజేపీ సభ్యుడు రాజీవ్‌ప్రతాప్ రూడీ లేవనెత్తారు. వాద్రా అంశం పై మాట్లాడ్డానికి తనకు సమయం ఇవ్వాలంటూ ఇచ్చిన జీరో అవర్ నోటీసుపై మీ స్పందనేమిటని ఆయన సభాధ్యక్షుడిని అడిగారు. ‘‘ఓ కుంభకోణం జరిగింది. అది జాతి యావత్తునూ కుదిపేస్తోంది. ఇందులో చాలా ప్రముఖుల హస్తం ఉంది’’ అని రూడీ అనగా.. ఆయన పార్టీ ఎంపీలందరూ మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు లేచి నిలబడి ప్రతి నినాదాలు చేశారు. దీంతో సభలో వాయిదాల పర్వం మొదలైంది.
 
 వాద్రా స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ తెరవాలి: సిన్హా
 యశ్వంత్ సిన్హా పార్లమెంటు బయట విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘వాద్రా చేసుకున్న భూ ఒప్పందాలపై విచారణకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేయాలని మేం కోరుతున్నాం. సిట్ వేస్తేనే అసలు నిజాలు బయటకొస్తాయి. వాద్రా చాలా చట్టాలను తుంగలో తొక్కారు. ఆయన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్‌లలోనే భూ ఒప్పందాలు చేసుకున్నారు. వాటన్నిటిపైనా విచారణ జరగాల్సిందే’’ అని డిమాండ్ చేశారు. వాద్రా తన కుంభకోణాలతో దేశానికి ఓ బిజినెస్ మోడల్‌గా నిలిచారని, కాబట్టి ‘వాద్రా స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్’ తెరవాలని తాను కాంగ్రెస్‌కు సూచిస్తున్నానంటూ ఎద్దేవా చేశారు. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం.. వాద్రా నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు.
 
 రాష్ట్ర పరిధిలోనిది: కాంగ్రెస్
 పార్లమెంటు సమావేశాల అనంతరం కాంగ్రెస్ ప్రతినిధి సందీప్ దీక్షిత్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘వాద్రా సభలో సభ్యుడు కాదు. ఆయన ఒక వ్యక్తి. వ్యక్తుల గురించి పార్లమెంటులో చర్చించం. ఆయన(సిన్హా) కావాలనుకుంటే దేశం లో చాలా ఫోరమ్‌లు ఉన్నాయి. హర్యానా కోర్టుకైనా వెళ్లొచ్చు. ఆయన్ను ఎవరూ ఆపరు’ అని అన్నారు. అయినప్పటికీ వాద్రాపై వచ్చిన ఆరోపణలు రాష్ట్రానికి సంబంధించిన అంశమని, వాటితో పార్లమెంటుకు, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేదని, కాబట్టి అవి తమ పరిధిలోకి రావని పేర్కొన్నారు. కావాలనుకుంటే సిన్హా హర్యానా ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చని అన్నారు. కాగా సమాచార, ప్రసార శాఖ మంత్రి మనీశ్ తివారీ పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ.. వాద్రా విషయంలో హర్యానా ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా తన పరిధికి మించి ప్రవర్తించారని విమర్శించారు. బీజేపీ సభ్యుడు రవిశంకర్ ప్రసాద్ మరోచోట విలేకరులతో మాట్లాడుతూ.. స్కామ్‌లో జాతీయ బ్యాంకు డాక్యుమెంట మేనిప్యులేషన్ కూడా ఉందని, కాబట్టి ఇది జాతీయ స్థాయి అంశమేనని, సభలో చర్చించాల్సిందేనన్నారు.
 
 పార్లమెంటులో ఎస్పీ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవగా.. యూపీలోని ఆ పార్టీ మంత్రి అజామ్‌ఖాన్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారు. ఆయన లక్నోలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సోనియా గాంధీ అల్లుడిపై ఎలాంటి చర్యలూ తీసుకోకూడదు. ఆయనకు ప్రత్యేక హక్కులున్నాయి’’ అని వ్యాఖ్యానించారు. వాద్రా అంశంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తే మేలని పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ వ్యాఖ్యానించారు.
 
 అన్సారీ వ్యాఖ్యపై సభలో గందరగోళం
 న్యూఢిల్లీ: రాజ్యసభలో వాద్రా అంశంపై బీజేపీ సభ్యులు, సమైక్యాంధ్ర డిమాండ్‌తో టీడీపీ సభ్యులు పదే పదే సభా వ్యవహారాలకు అంతరాయం కలిగించడంతో చైర్మన్ హమీద్ అన్సారీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు తమ సీట్లలో కూర్చోవాలని ఆయన పదే పదే విజ్ఞప్తి చేసినా ఎవరూ వినకపోవడంతో.. ‘‘నిబంధనల పుస్తకంలోని ప్రతి నిబంధననూ ఉల్లంఘిస్తున్నారు.. ప్రతి మర్యాదనూ మంటగలుపుతున్నారు. సభను ఓ అరాచకవాదుల సమాఖ్య చేయాలని సభ్యులు అనుకుంటే పరిస్థితి మరోలా ఉంటుంది’’ అని అన్సారీ అన్నారు. దీనిపై మండిపడిన బీజేపీ సభ్యులు.. అన్సారీ వ్యాఖ్యలు సభా మర్యాదకు భంగం కలిగించేలా ఉన్నాయని, వాటిని రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement