చైనా దుస్సాహసానికి దిగితే ఆయుధాలు వాడొచ్చు

Rajnath Singh meets top military brass and armed forces given full freedom - Sakshi

ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కేంద్రం నిర్ణయం

సరిహద్దుల్లో పరిస్థితిని సమీక్షించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ: చైనాతో ఉన్న దాదాపు 3500 కి.మీ.ల పొడవైన సరిహద్దు వెంబడి విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు ఇకనుంచి ‘పూర్తి స్వేచ్ఛ’ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. చైనా సైనికులు ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే సరైన గుణపాఠం చెప్పే స్వేచ్ఛను సైన్యానికి ఇచ్చింది. అందులో భాగంగా, అరుదైన, తప్పనిసరి సందర్భాల్లో ఆయుధాలను సైతం ఉపయోగించే వెసులుబాటును కల్పించింది. సీడీఎస్, త్రివిధ దళాల ఉన్నతాధికారులతో కలిసిన తూర్పు లద్దాఖ్‌లోని క్షేత్రస్థాయి పరిస్థితిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదివారం సమీక్షించారు.

ఈ సందర్భంగా.. చైనా దురాక్రమణను అడ్డుకునేందుకు తప్పని సరైతే ఆయుధాలను కూడా ఉపయోగించే నిర్ణయం క్షేత్రస్థాయి కమాండర్లు తీసుకునేందుకు అనుమతించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని త్వరలో చైనాకు అధికారికంగా  తెలియజేయనున్నట్లు చెప్పాయి. సరిహద్దుల్లో సైనికుల మధ్య నెలకొనే ఘర్షణల్లో ఆయుధాలను ఉపయోగించకూడదని పేర్కొంటూ భారత్, చైనాల మధ్య 1996, 2005ల్లో కుదిరిన ఒప్పందాలను పక్కనబెడుతూ ఈ నిర్ణయం తీసుకున్నారన్నాయి. ‘ఇకనుంచి మన తీరు మారనుంది.

పరిస్థితిని బట్టి స్వయంగా నిర్ణయం తీసుకునేందుకు క్షేత్రస్థాయి కమాండర్లకు పూర్తి స్వేచ్ఛ లభించింది’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని సైన్యాధికారి ఒకరు వెల్లడించారు. తూర్పు లద్దాఖ్‌తో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌ల్లోని సరిహద్దుల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులను రాజ్‌నాథ్‌ ఈ భేటీలో లోతుగా సమీక్షించారని వెల్లడించాయి. ఈ భేటీలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ కరంబీర్‌ సింగ్, వైమానిక దళాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్కేఎస్‌ బధౌరియా పాల్గొన్నారు. సరిహద్దుల్లో చైనా కార్యకలాపాలను నిశిత దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా త్రివిధ దళాలకు రక్షణ మంత్రి ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలన్నారు. సరిహద్దుల్లో కఠిన వైఖరి అవలంబించాలని సూచించారు.   

ఆయుధాలకు అదనంగా రూ. 500 కోట్లు
ఆయుధ వ్యవస్థ, మందుగుండు తదితర యుద్ధ సన్నద్ధతకు అవసరమైన సామగ్రి కొనుగోలు కోసం రూ.500 కోట్ల వరకు అదనంగా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం త్రివిధ దళాలకు అనుమతినిచ్చింది. సైనిక వ్యవహారాల విభాగంతో సంప్రదించి, అత్యవసర ప్రాతిపదికన ఈ నిధులను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. అవసరమైన ఆయుధ వ్యవస్థ, ఇతర సామగ్రి జాబితాను రూపొందించే పనిని ఇప్పటికే త్రివిధ దళాలు ప్రారంభించాయని సమాచారం. ఇప్పటికే చైనా సరిహద్దుల వెంబడి ఉన్న వాస్తవాధీన రేఖ సమీప సైనిక కేంద్రాల్లోకి భారత్‌ భారీగా బలగాలను మోహరించింది. ఆయుధాలను, వాహనాలను ఇతర సామగ్రిని తరలించింది. లేహ్, శ్రీనగర్‌ సహా పలు కీలక వైమానిక కేంద్రాలకు సుఖోయి 30 ఎంకేఐ, జాగ్వార్, మిరేజ్‌ 2000 యుద్ధ విమానాలను, అపాచీ చాపర్లను ఎయిర్‌ ఫోర్స్‌ తరలించింది.   
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top