అధికారంలోకి వస్తే రఫేల్‌పై విచారణ : రాహుల్‌ | Sakshi
Sakshi News home page

అధికారంలోకి వస్తే రఫేల్‌పై విచారణ : రాహుల్‌

Published Fri, Jan 4 2019 4:30 PM

Rahul Says Congress Will Launch Investigation Into Rafale If voted To Power   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రఫేల్‌ ఒప్పందంపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షిస్తుందని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. రఫేల్‌పై చర్చకు ప్రభుత్వం బదులిచ్చే క్రమంలో శుక్రవారం పార్లమెంట్‌ వెలుపల రాహుల్‌ మీడియాతో మాట్లాడుతూ రఫేల్‌పై చర్చ అంటే ప్రధాని నరేంద్ర మోదీ పారిపోతున్నారని దుయ్యబట్టారు. ఈ ఒప్పందంపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన పలు ప్రశ్నలు సంధించారు.

రఫేల్‌పై విచారణ అవసరం లేదని సుప్రీం కోర్టు ఎక్కడా చెప్పలేదని, దీనిపై విచారణకు ఆదేశించే పరిధి న్యాయస్ధానానికి లేదని మాత్రమే సర్వోన్నత న్యాయస్ధానం పేర్కొందని రాహుల్‌ అన్నారు. రఫేల్‌పై తాము లేవనెత్తిన అంశాలన్నింటికీ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ బదులివ్వాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు.  మరోవైపు రఫేల్‌ ఒప్పందంపై కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ సభను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆరోపించారు.


అంబానీకి ఆ కాంట్రాక్టు ఎవరిచ్చారు..
అనిల్‌ అంబానీ సంస్థకు రఫేల్‌ ఒప్పందంలో భాగస్వామ్యం కల్పించింది ఎవరని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. లోక్‌సభలో నిర్మలా సీతారామన్‌ ప్రసంగానికి అడ్డుతగిలిన రాహుల్‌ ఒప్పందానికి సంబంధించి పలు అంశాలను లేవనెత్తారు. రఫేల్‌ డీల్‌ అంతా ప్రధాని నరేంద్ర మోదీ కనుసన్నల్లో జరిగిందని అన్నారు. అనిల్‌ అంబానీ కంపెనీకి రఫేల్‌ ఒప్పందంలో భాగస్వామిగా చేర్చాలని  ప్రధాని మోదీ సూచించారని ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు హోలాండ్‌ వెల్లడించారన్నారు.

Advertisement
Advertisement