సీఏఏకు వ్యతిరేకంగా పంజాబ్‌ అసెంబ్లీ తీర్మానం | Sakshi
Sakshi News home page

సీఏఏకు వ్యతిరేకంగా పంజాబ్‌ అసెంబ్లీ తీర్మానం

Published Fri, Jan 17 2020 5:26 PM

Punjab State Passes Resolution Against Citizenship Amendment Act - Sakshi

చండీగఢ్‌ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్‌ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. సీఏఏకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్న నేపథ్యంలో పంజాబ్‌  ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ విషయంపై గత నెలలో కేరళ కూడా తీర్మానం చేసిన విషయం తెలిసిందే. తాజాగా సీఏఏను రద్దు చేయాలని అధికార కాంగ్రెస్‌ తీసుకు వచ్చిన ఈ తీర్మానాన్ని పంజాబ్‌ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. దీంతో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మాణం చేసిన రెండో రాష్ట్రంగా పంజాబ్‌ నిలిచింది. పంజాబ్‌ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర మంత్రి బ్రహ్మ మహింద్రా ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు.(నేను కేవలం రబ్బర్‌ స్టాంప్‌ను కాదు..)

‘పంజాబ్‌తో సహా దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చోటుచేసుకున్నాయి. అందుకే ఈ చట్టాన్ని రద్దు చేయాలని తీర్మానం చేస్తున్నాం’ అని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. కాగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేసిన మొదటి రాష్ట్రంగా కేరళ ఉండగా రెండో రాష్ట్రంగా పంజాబ్‌ నిలిచింది. ‘పౌరసత్వ సవరణ చట్టాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా మార్చడానికి తగిన మార్పులు చేయాలని మేము కేంద్రానికి ఒక ముసాయిదా పంపాము. ఇప్పుడు జనాభా గణన జరుగుతోంది, ఇది పాత పద్దతిలోనే జరుగుతుంది. ప్రతి పౌరుడు ముస్లిం, హిందూ, సిక్కు, క్రిస్టియన్ లేదా ఎవరైనా భారతీయ పౌరుడుగానే గుర్తింపడతారు’ అని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన తరువాత తెలిపారు. 

Advertisement
Advertisement