జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న కోవింద్
న్యూఢిల్లీ: ఓటు హక్కు వినియోగించుకోవడం పవిత్ర కార్యం, శతాబ్దంలో ఒక్కసారి మాత్రమే దక్కే అరుదైన అవకాశంగా భావించండి అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశానికి ఇది పరీక్షా సమయమన్న రాష్ట్రపతి.. ఇప్పుడు వేసే ఓటు ఈ శతాబ్దంలో దేశం గతిని నిర్ణయిస్తుందన్నారు. పేదలకు రిజర్వేషన్ల కల్పన గాంధీ కలల సాకారం దిశగా పడిన అడుగుగా ఆయన అభివర్ణించారు. 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.  ‘వైవిధ్యం, ప్రజాస్వామ్యం, అభివృద్ధి అనే మూడు అంశాలపై ఆధారపడిన భిన్నత్వంలో ఏకత్వ భావనను స్వీకరించనిదే దేశాభివృద్ధి పరిపూర్ణం కాదు. ఈ దేశం మనది, మన అందరిదీ. మన వైవిధ్యం, ప్రజాస్వామ్యం, అభివృద్ధి ప్రపంచానికి ఆదర్శం. ఇవి విడదీయరానివి. ఈ మూడూ మనకు అత్యవసరం’ అని రాష్ట్రపతి అన్నారు.  
ఓటర్లకు విన్నపం
మరో నాలుగు నెలల్లో జరగనున్న సాధారణ ఎన్నికలను ప్రస్తావిస్తూ ఆయన..‘21వ శతాబ్దంలో పుట్టిన పౌరులు మొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లోక్‌సభ ఎన్నికల్లో దక్కనుంది. భారతీయుల ఆకాంక్షలకు, విభిన్నతకు నిదర్శనం ఈ ఎన్నికలు.  అర్హులైన ఓటర్లందరికీ నా విన్నపం ఒక్కటే.. పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేయండి’ అని ప్రజలకు ముఖ్యంగా యువతకు పిలుపునిచ్చారు. ‘ఈ ఎన్నికలు తరానికి ఒక్కసారి వచ్చే ఎన్నికలు మాత్రమే కాదు..ఈ శతాబ్దానికి ఏకైక ఎన్నికలుగా భావించండి. ప్రజాస్వామ్య ఆదర్శాలు, ఆలోచనలను ఆచరణలోకి తెచ్చేవి ఈ ఎన్నికలు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయాణంలో, దేశ అభివృద్ధిలో ఇవి ఒక మైలురాయి మాత్రమే’ అని అన్నారు.  
ప్రజలందరికీ సమాన అవకాశాలు
‘పేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యం కల్పించేందుకు ఇటీవల చేపట్టిన రాజ్యాంగ సవరణ గాంధీజీ కలలు, భారతీయుల కలల సాకారం వైపునకు పడిన మరో అడుగు’ అని అన్నారు. ప్రతి చిన్నారి, ప్రతి మహిళకు సమాన అవకాశాలు, సమాన పరిస్థితులు కల్పించడమే మన సమాజం లింగ సమానత్వం సాధించిందనేందుకు సరైన సూచిక’ అని తెలిపారు. మన రాజ్యాంగానికి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు గౌరవసూచికగా ఈ ఏడాది దేశం ఘనంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకోనుంది’ అని పేర్కొన్నారు.  

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
