ఢిల్లీలో కట్టడిపై మోదీ ప్రశంస

PM Narendra Modi reviews COVID-19 situation in India - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక యంత్రాంగాల కృషిని ప్రధాని మోదీ కొనియాడారు. ఇక్కడ ఆవలంబించిన విధానాలనే జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌)లోనూ అమలు చేసి, మహమ్మారిని అదుపు చేయాలని సూచించారు. అదేవిధంగా, కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా బయటపడుతున్న రాష్ట్రాలు, ప్రాంతాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ కంటైన్‌మెంట్‌ అమలు తీరుపై సమీక్ష జరిపి, సూచనలను ఎప్పటికప్పుడు అందిస్తుండాలని కూడా ఆయన కోరారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కోవిడ్‌–19 పరిస్థితి, ఆయా రాష్ట్రాల సన్నద్ధతపై ప్రధాని మోదీ శనివారం సమీక్ష జరిపారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ వైరస్‌ను వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు వ్యక్తిగత పరిశుభ్రత, బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో రాజీకి తావులేదన్నారు. ఈ జాగ్రత్తలపై యంత్రాంగాలు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కరోనా బాధితులను ఇంటివద్దే పర్యవేక్షించి, వైద్యం అందించే ‘ధన్వంతరి రథ్‌’ విధానం ఫలితాలను ఇచ్చిందనీ, దీనిని మిగతా ప్రాంతాల్లోనూ అమలు చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో హోం మంత్రి అమిత్‌ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ కూడా పాల్గొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top