‘కరోనా’పై అవగాహన పెంచండి

PM Modi interacts with representatives of social welfare organizations - Sakshi

వదంతులను నమ్మవద్దని ప్రజలకు వివరించండి

స్వచ్ఛంద సంస్థలకు ప్రధాని మోదీ వినతి

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై సోషల్‌మీడియాలో వెల్లువెత్తుతున్న వదంతులు, తప్పుడు వార్తలు, మూఢ విశ్వాసాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని సామాజిక సంక్షేమ రంగంలో ఉన్న సంస్థలను కోరారు. తప్పుడు వార్తలు, కథనాలను ఖండిస్తూ సరైన సమాచారం ప్రజలకు అందించేలా కృషి చేయాలన్నారు. భౌతిక దూరం పాటించాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ఈ విశ్వాసాల పేరుతో భౌతికంగా దూరం పాటించాలన్న ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా ప్రజలు గుంపులుగా గుమికూడుతున్నారని, దీనివల్ల కరోనా వైరస్‌ మరింత ప్రబలే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమ రంగంలో పనిచేస్తున్న సంస్థల ప్రతినిధులతో ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా సంభాషించారు.

దేశం ఇప్పుడు మునుపెన్నడూ కనీవినీ ఎరగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్న ప్రధాని.. ఈ గడ్డుకాలంలో పేదలు, ఇతర బలహీన వర్గాలకు నిత్యావసరాలను సమకూర్చడం, వైద్య సదుపాయాలు కల్పించడం, కరోనా పేషెంట్లకు సేవచేయడం తదితర మార్గాల్లో ఆదుకోవాలని స్వచ్ఛంద సంస్థలను కోరారు. ‘ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక చర్యలు చేపట్టడంతో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. మానవీయ  దృక్పథం, ప్రజా బాహుళ్యానికి అందుబాటులో ఉండటం సానుకూలతలు కలిగిన స్వచ్చంధ సంస్థలు ఈ సమయంలో ముందుకు రావాలి’ అన్నారు. పేదలు, అణగారిన వర్గాలకు చేసే సేవే దేశసేవలో అత్యుత్తమ విధానమన్న మహాత్మాగాంధీ సూక్తిని ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

మోదీ.. యోగా
యోగా చేస్తున్న తన 3డీ యానిమేటెడ్‌ వీడియోలను మోదీ ట్వీట్‌ చేశారు. ‘ఫిట్‌నెస్‌ను కాపాడుకునేందుకు ఈ సమయంలో మీరేం చేస్తున్నారని మన్‌ కీ బాత్‌ సందర్భంగా నిన్న ఒక వ్యక్తి నన్ను ప్రశ్నించారు. యోగా చేస్తానని, ఆ వీడియోలను షేర్‌ చేస్తానని చెప్పాను. అందుకే ఇప్పుడు ఈ వీడియోలను ట్వీట్‌ చేస్తున్నా’ అని మోదీ తెలిపారు. మరోవైపు,  విదేశాల్లోని 130 భారతీయ రాయబార కార్యాలయాల అధికారులతో సోమవారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా ప్రమాదాన్ని తగ్గించే లక్ష్యంతో భారత్‌ జనవరి రెండో వారం నుంచే మునుపెన్నడూ తీసుకోనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించిందని వారికి వివరించారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top