సామరస్యం మిగిలే ఉంది!

People Want Peace From Delhi Violence - Sakshi

ఢిల్లీ ఘటనలు మిగిల్చిన విషాదం

తల్లడిల్లినచోటే.. వెల్లివిరిసిన సామరస్యం

‘గతంలో నేనెప్పుడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదు. ఇరుగూపొరుగూ ప్రశాంతంగా జీవించేవాళ్లం. నా హిందూ కస్టమర్లంతా నా క్షేమ సమాచారం కోసం విచారిస్తున్నారు’
జాఫ్రాబాద్‌ రోడ్డులో ఉన్న తన షాప్‌ని ఇప్పటికీ తెరవడానికి సాహసించని సయ్యద్‌ సుహెయిల్‌

‘గత మూడు రోజులుగా నేను ఇల్లు విడిచి బయటకు వెళ్లలేదు. అయితే నేను క్షేమంగానే ఉన్నాను. మరి నువ్వు..’ 
ఆరుపదుల అల్లాహ్ను కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న తన హిందూ మిత్రుడి క్షేమ సమాచారం కోసం చేసిన ఫోన్‌ సంభాషణ ఇది.

నిజానికి ఇంకెప్పుడైనా అయితే ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక, అనుకూల ఆందోళనల కారణంగా హింస చెలరేగిన ప్రాంతంలో హిందువులెవరో, ముస్లింలెవరో కనిపెట్టడం చాలా కష్టం. హిందువుల ఇంట్లో పెళ్లికి ముస్లిం వంట చేసి, వడ్డిస్తాడు. ముస్లిం ఇంట్లో శవపేటికను హిందువు భుజానమోస్తాడు. పెళ్లీ, పేరంటం, చావు, పుట్టుక ప్రతి సందర్భాన్నీ పంచుకుని పరవశించే చోట ముస్లిం ఎవరో, హిందువెవరో ఎవరికి కావాలి?. సూర్యోదయం వేళ హిందువుల పూజకు పూలు తెచ్చి వాకిట్లోకందించే ముస్లింకి అదే జీవనోపాధి. రంజాన్‌ వేళ ముస్లిం సోదరుడి ఆకలి తీర్చేందుకు మసీదు బయట బారులుతీరి ఫలాలన్నీ అమ్మితేనే హిందువు నోట్లోకి నాలుగువేళ్లూ వెళ్లేది. అయినా ఎవరి ఆరాధ్యదైవాలూ, ఎవరి ప్రార్థనాలయాలూ వారివే. అంతమాత్రాన ఇల్లు తగలబడుతోంటే అది హిందువుది కదాని ముస్లింలు ఊరుకోలేదే.. ప్రాణాలకు తెగించి ఓ వృద్ధురాలిని కాపాడారు. ఓ ముస్లింని ఎక్కడ చంపేస్తారోనని భార్యాభర్తలిద్దరికీ హిందువుల బట్టలు తొడిగి రాత్రంతా వారిని కడుపులో పెట్టుకొని కాపాడి తెల్లవారి ఒడ్డుదాటించిన కుటుంబం నిజంగా ఈ దేశ సమైక్యతకు ప్రత్యక్ష సాక్ష్యం.

హింస జాడలు.. నీడలు
దాదాపు 40 మందికి పైగా ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయిన అమానవీయ దృశ్యాలతో ఈశాన్య ఢిల్లీ తల్లడిల్లిపోయింది. ఎప్పుడూ జనంతో కళకళలాడే దుకాణాలకు మూతపడిన షట్టర్లు.. నిత్య సందడి నింపుకున్న గోడల నిండా నిన్నటి హింస తాలూకూ నెత్తుటి జాడలు.. రక్తసిక్తమైన రహదారులు.. అదంతా పౌరసత్వ సవరణ చట్టం అనుకూల – వ్యతిరేక ఆందోళనల పేరుతో చెలరేగిన హింసారాత్రులు మిగిల్చిన  దృశ్యం. మతాతీత సహజీవనానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన వీధులన్నిటా కమ్ముకున్న శ్మశాన నిశ్శబ్దం. అయినా అక్కడింకా అందరూ చెప్పుకునే మానవీయత బతికే ఉంది. రాజకీయాలకూ, సిద్ధాంత రాద్ధాంతాలకూ సంబంధంలేని సామాన్యులెందరో ఒకరినొకరు ఒడిజేర్చుకుంటున్నారు. ఒకరి ప్రాణాలను ఒకరు కాపాడుకుంటూనే ఉన్నారు.

ఒకరికొకరు..
ఘటన జరగడానికి కొద్దిగంటల ముందు వందలాది మంది ముస్లిం మహిళలు జాఫ్రాబాద్‌ మెట్రో స్టేషన్‌ కింద కూర్చుని ఉన్నారు. వారంతా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. మౌజ్‌పూర్‌ మహిళలు సైతం ఈ ఆందోళనకారులకు వ్యతిరేకంగా అక్కడే నిరసనకు దిగారు. ఆ సాయంత్రం సీఏఏ ఆందోళన స్థలాన్ని ఢిల్లీ పోలీసులు ఖాళీ చేయించారు. ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్, మౌజ్‌పూర్, భజన్‌పుర, చాంద్‌ బాగ్‌ సహా ఇతర పరిసర ప్రాంతాల్లోని ప్రజలు జరిగిన ఘటనలతో భయకంపితులయ్యారు. ముస్లింలు అధికంగా ఉన్న జాఫ్రాబాద్‌ నుంచి అత్యధిక మంది హిందువులు జీవించే మౌజ్‌పూర్‌ను కలిపే ఒక కిలోమీటరు రహదారి పొడవునా మనుసును మెలిపెట్టే చేదు జ్ఞాపకాల్లోంచి ఇప్పుడిప్పుడే జనం బయటపడుతున్నారు. అక్కడ శిథిలమైన మతసామరస్యాన్ని పునర్నిర్మించుకునేందుకు కొంత సమయం పట్టవచ్చు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీలో పరిస్థితులను అదుపులోకి తేవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top