ప్రపంచ వ్యాప్తంగా ‘ప్యారడైజ్‌’ ప్రకంపనలు | Paradise papers leak : 714 Indian has hidden wealth | Sakshi
Sakshi News home page

ప్రపంచ వ్యాప్తంగా ‘ప్యారడైజ్‌’ ప్రకంపనలు

Nov 7 2017 12:00 AM | Updated on Nov 7 2017 5:14 AM

Paradise papers leak : 714 Indian has hidden wealth - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పనామా పత్రాలు సృష్టించిన కల్లోలం ఇంకా పూర్తిగా మార్చిపోకముందే అదే తరహాలో పరిశోధక జర్నలిస్టులు విడుదల చేసిన ‘ప్యారడైజ్‌ పత్రాలు’ ప్రపంచవ్యాప్తంగా కుబేరుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. బ్రిటన్‌ రాణి ఎలిజబెత్, అమెరికా వాణిజ్య మంత్రి విల్‌బర్‌ రోస్‌ సహా పలువురు భారతీయ కుబేరుల అక్రమాలను బహిర్గతం చేశాయి.

దాదాపు 714 మంది భారతీయ సంపన్నులు, వందలాది కంపెనీలు పన్నులు ఎగ్గొట్టాయని తెలిపాయి. పన్నులు ఎగ్గొట్టేందుకు తమ ఆస్తులను బెర్ముడా, కేమాన్‌ ఐలాండ్స్‌ వంటి దేశాల్లో ఎలా దాచుకున్నదీ ఇవి వెల్లడించాయి. వివిధ దేశాల్లోని 96 వార్తాసంస్థల భాగస్వామ్యంతో విచారణ జరిపిన ఇంటర్నేషనల్‌ కన్సార్షియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌ (ఐసీఐజే) మొత్తం 1.3 కోట్ల పత్రాలను బహిర్గతం చేసింది. ఈ అక్రమాస్తులకు సంబంధించి 180 దేశాలకు ర్యాంకులు కేటాయించగా మనదేశం 19వ స్థానంలో నిలిచింది.

గతంలో పనామా పేపర్స్‌ను లీక్‌ చేసింది కూడా ఐసీఐజేయే! బెర్ముడా దేశంలోని ‘ఆపిల్‌బీ’ అనే న్యాయసంస్థ నుంచి, సింగపూర్‌కు చెందిన ఆసియా సిటీ సంస్థల నుంచి ఈ డాక్యుమెంట్లను  రాబట్టింది. ఈ రెండు సంస్థలూ కుబేరుల సంపద, ఆస్తులను విదేశాలకు తరలిస్తుంటాయి. నంద్‌లాల్‌ ఖేమ్కా అనే భారతీయ వ్యాపారికి ఆపిల్‌బీలో ఏకంగా 118 కంపెనీలను నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. కేంద్ర వైమానికశాఖ సహాయమంత్రి జయంత్‌ సిన్హా, బీజేపీ ఎంపీ ఆర్కే సిన్హా, బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ పేర్లు కూడా ప్యారడైజ్‌పత్రాల్లో కనిపించాయి. కార్పొరేట్‌ లాబీయిస్టు నీరా రాడియా, సంజయ్‌ దత్‌ భార్య మాన్యత సైతం విదేశాల్లో ఆస్తులు కూడబెట్టినట్టు తేలింది. తాము ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదని, తమ ఆస్తుల లెక్కలన్నీ సక్రమంగానే ఉన్నాయని వారు వివరణ ఇచ్చారు.

రెండోస్థానంలో భారతీయులు
ఆపిల్‌బీ ఖాతాదారుల్లో భారతీయులు రెండోస్థానంలో ఉన్నారు. మరో రెండు రోజుల్లో ప్రభుత్వం పెద్ద నోట్లను ప్రకటించి ఏడాది పూర్తయిన క్రమంలో నల్లధన వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంలో ఈ కుంభకోణం వెలుగులోకి రావడం తీవ్ర ప్రకంపనాలను సృష్టిస్తోంది. ఈ ప్యారడైజ్‌ పేపర్లు ఆఫ్‌షోర్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన అంతర్జాతీయస్థాయి ప్రముఖుల వివరాలను కూడా బయటపెట్టాయి. వీటిలో అమెరికా వాణిజ్య మంత్రి విల్‌బర్‌ రోస్‌ పేరు కూడా ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అల్లుడికి చెందిన ‘నేవిగేటర్‌ హోల్డింగ్స్‌’లో ఆయనకి వాటా ఉన్నట్టు వెల్లడయింది. పేపర్ల లీకేజీపై స్పందించిన ఆపిల్‌బీ తమ సమాచారం చోరీ అయిందని, అయితే తమ వద్ద ఎటువంటి అవకతవకలూ జరగలేని స్పష్టం చేసింది. కాగా, పనామా పేపర్స్‌ కుంభకోణంలో చిక్కుకున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీప్‌ తన పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో పాక్‌ మాజీ ప్రధాని షౌకత్‌ అజీజ్‌ పేరు కూడా ఈ జాబితాలో కనిపించింది. బెర్ముడా దేశంలో దాచిన నగదు గురించి ఆయన ఎన్నడూ వెల్లడించలేదని ఐసీఐజే తెలిపింది. దాదాపు 135 పాకిస్థాన్‌ సంపన్నుల పేర్లు అప్లెబీలో ఉన్నాయి.  

విచారణ జరుపుతాం : సెబీ
ప్యారడైజ్‌ పత్రాలు పేర్కొన్న భారతీయ కార్పొరేట్‌ సంస్థలపై, పారిశ్రామిక వేత్తలపై విచారణ జరుపుతామని మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ప్రకటించింది. ఈ పత్రాలు పేర్కొన్న కంపెనీల్లో కొన్నింటిపై ఇది వరకే విచారణ కొనసాగుతోందని తెలిపింది. పన్నుల్లేని దేశాల్లో మదుపు చేసిన వాళ్లంతా నేరం చేసినట్టుగా భావించలేమని సెబీ అధికారి ఒకరు అన్నారు. లెక్కలు లేని ధనం, అక్రమంగా డబ్బు తరలిస్తే మాత్రం చర్యలు ఉంటాయని తెలిపింది. విజయ్‌ మాల్యా  కంపెనీలతోపా టు జిందాల్‌స్టీల్, ఎస్సార్‌ షిప్పింగ్, వీడియోకాన్‌ ఇండస్ట్రీస్, సన్‌ టీవీ, అపోలో టైర్స్‌ సంస్థల పేర్లు ఈ పత్రాల్లో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement