సంచలనం: అడ్డదారిలో ఉబర్‌ క్యాబ్‌,వేల కోట్ల డాలర్ల నిధులు మళ్లింపు!

Uber lobbied political leaders to relax labour and taxi laws - Sakshi

వేల కోట్ల డాలర్లతో లాబీయింగ్‌

పన్నుల ఎగవేత...

స్టెల్త్‌ టెక్నాలజీతో తప్పులకు ముసుగు

ఉబర్‌ నిర్వాకాలు బయటపెట్టిన ఐసీఐజే

యాప్‌ ఆధారిత చౌక ట్యాక్సీ సేవల పేరుతో దశాబ్ద కాలం క్రితం (2009లో) కార్యకలాపాలు ప్రారంభించిన ఉబర్‌ .. అతి తక్కువ కాలంలోనే అత్యంత వేగంగా 30 పైచిలుకు దేశాల్లో వ్యాపారాన్ని విస్తరించింది. ఈ క్రమంలో వ్యవస్థలను, రాజకీయ నేతలను మేనేజ్‌ చేసింది. డ్రైవర్లను వాడుకుంది. కార్మిక, ట్యాక్సీ చట్టాలను తనకు అనుకూలంగా మల్చుకునేందుకు వేల కోట్ల డాలర్లు వెచ్చించి నేతలతో లాబీయింగ్‌ చేయడం మొదలుకుని, పన్నుల ఊసు ఉండని దేశాలకు లాభాలను మళ్లించడం, డ్రైవర్లను బలిపశువులను చేయడం వరకూ అన్ని అడ్డదారులూ తొక్కింది.

ఇలా ఉబర్‌ పాటించిన తప్పుడు విధానాలను రుజువు చేసే డాక్యుమెంట్స్‌ లీకవడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. టెక్ట్స్‌ మెసేజీలు, ఈమెయిల్స్‌ రూపంలో ఉన్న వీటిని ఉబర్‌ ఫైల్స్‌ పేరిట అంతర్జాతీయంగా ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టుల కన్సార్టియం అయిన ఐసీఐజే బైటపెట్టింది. గతంలో ప్రముఖుల అక్రమాస్తులను పనామా పేపర్స్‌ పేరిట బైటపెట్టి సంచలనం సృష్టించినది కూడా ఈ ఐసీఐజేనే కావడం గమనార్హం.

1,24,000 పైచిలుకు డాక్యుమెంట్స్‌ లీక్‌ కాగా వీటిలో 83,000 పైచిలుకు ఈమెసేజీలు, వాట్సాప్‌ మెసేజీలు ఉన్నాయి. ఉబర్‌ సహ–వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో ట్రావిస్‌ కలానిక్‌ సారథ్యంలో 2013–2017 మధ్య కాలంలో ఉబర్‌ విస్తరణ గురించిన వివరాలు వీటిలో ఉన్నాయి. లింగ వివక్ష, లైంగిక వేధింపుల ఆరోపణలతో 2017లో కలానిక్‌ బలవంతంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ డాక్యుమెంట్లు తొలుత బ్రిటిష్‌ న్యూస్‌పేపర్‌ ది గార్డియన్‌కు, అక్కణ్నుంచి ఐసీఐజేకి అందాయి. యూరప్‌లో ఉబర్‌ తరఫున లాబీయిస్టుగా పనిచేసిన మార్క్‌ మెక్‌గాన్‌.. ఈ అక్రమాలను బైటపెట్టడంలో కీలకమైన ప్రజావేగుగా వ్యవహరించారు.  

యధేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన..
రైడ్‌ షేరింగ్‌ యాప్‌ ద్వారా చౌకగా ట్యాక్సీ సేవలను అందించే క్రమంలో ఉబర్‌ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినట్లు అనిపించినప్పటికీ.. వాస్తవానికి వ్యాపార విస్తరణ కోసం నిబంధనలన్నింటినీ ఉల్లంఘించినట్లు ఉబర్‌ ఫైల్స్‌ ద్వారా వెల్లడైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు సన్నిహితులైన వ్యక్తులు ఉబర్‌కు లాబీయిస్టులుగా పనిచేశారు. కంపెనీ మీద వస్తున్న ఆరోపణలపై విచారణ నిలిపివేయాలంటూ దర్యాప్తు సంస్థలను, కార్మిక .. ట్యాక్సీ చట్టాలను సవరించాలంటూ, డ్రైవర్ల బ్యాగ్రౌండ్‌ ధ్రువీకరణ నిబంధనలను సడలించాలంటూ అధికారులపై వారు ఒత్తిడి తెచ్చారు. యూరప్‌ తదితర మార్కెట్లలోనూ ఉబర్‌ ఇదే తరహా ధోరణిలో విస్తరించింది.

అప్పటి ఫ్రాన్స్‌ ఆర్థిక మంత్రి ఎమాన్యుయెల్‌ మాక్రాన్‌ (ప్రస్తుత అధ్యక్షుడు), యూరోపియన్‌ కమిషన్‌ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ నీలీ క్రోయెస్‌ వంటి వారు ఇందుకు సహకరించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇక, మిగతా మార్గాలేవీ పనిచేయనప్పుడు విచారణ జరిపే దర్యాప్తు సంస్థలకు వివరాలను దొరకనియ్యకుండా చేసేందుకు ఉబర్‌ ‘‘కిల్‌ స్విచ్‌’’అనే స్టెల్త్‌ టెక్నాలజీని ఉపయోగించింది. సోదాల్లో కీలక ఆధారాలు అధికారులకు చిక్కకుండా ఇది ఆటోమేటిక్‌గా ఉబర్‌ సర్వర్లకు యాక్సెస్‌ నిలిపివేసేది. ఉబర్‌ ఇలా కనీసం ఆరు దేశాల్లో చేసింది. అలాగే, మిలియన్ల కొద్దీ డాలర్ల పన్నులను ఎగ్గొట్టేందుకు ఉబర్‌ తనకు వచ్చే లాభాలను బెర్ముడా తదితర ట్యాక్స్‌ హేవెన్స్‌కు (పన్నుల భారం ఉండని దేశాలు) మళ్లించింది.

ఔను తప్పే.. కానీ ఇప్పుడు మారాము..
తాజా పరిణామాలపై ఉబర్‌ స్పందించింది. గతంలో తప్పిదాలు జరిగిన సంగతి వాస్తవమేనని.. వాటిని సమర్థించుకోబోమని పేర్కొంది. ఆ తప్పిదాల ఫలితంగా పలువురు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించినట్లు ఉబర్‌ తెలిపింది. కొత్త సీఈవో దారా ఖుస్రోవ్‌షాహీ వచ్చాక గత అయిదేళ్లలో కంపెనీ పనితీరు పూర్తిగా మారిపోయిందని వివరించింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో 90 శాతం మంది .. దారా సీఈవోగా వచ్చాక చేరినవారేనని పేర్కొంది. పోటీ సంస్థలతో పాటు లేబర్‌ యూనియన్లు, ట్యాక్సీ కంపెనీలు మొదలైన వర్గాలతో చర్చలు జరిపేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు ఉబర్‌ వివరించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top