రాణి పద్మావతి ఎవరు?

Padmavati, the real story that Malik Muhammad Jayasi told 224 years after Alauddin Khiljis death - Sakshi - Sakshi

అసలు పద్మావతి ఉందా?
1540లో ఉత్తరప్రదేశ్‌లోని అవధ్‌ ప్రాంతానికి చెందిన సూఫీ కవి మాలిక్‌ మహ్మద్‌ జాయసీ ‘పద్మావత్‌’ పేరుతో రాసిన కవితలో ఈ రాణి ప్రస్తావనుంది. మాలిక్‌ కథ ప్రకారం..  పద్మావతి సింహళ దేశ రాజకుమారి. అందాల రాశి. 13, 14 శతాబ్దాల మధ్య జన్మించింది. ఈమెను రాజస్తాన్‌లోని చితోడ్‌గఢ్‌ రాజు రతన్‌సేన్‌ పెళ్లాడతాడు.

అల్లావుద్దీన్‌ ఖిల్జీతో సంబంధం ఏమిటి?
నాటి ఢిల్లీ సుల్తాన్‌ అల్లావుద్దీన్‌ ఖిల్జీ రాజ్య విస్తరణ కాంక్షతో రగిలిపోతుంటాడు. పద్మావతి సౌందర్యం గురించి విని చితోడ్‌గఢ్‌పై దండెత్తుతాడు. ఆ క్రమంలో జరిగిన యుద్ధంలో రతన్‌సేన్‌ మరణిస్తాడు. ఖిల్జీకి దక్కకుండా పద్మావతి ఆత్మార్పణ చేసుకుంటుంది.

చరిత్ర ఏం చెబుతోంది?
జాయసీ కథ నిజమా కాదా అన్న విషయంలో అనేక వాదనలున్నాయి. చాలామంది చరిత్రకారులు, ప్రొఫెసర్లు దీన్ని కొట్టిపడేస్తున్నారు. చరిత్ర ప్రకారం ఖిల్జీ చితోడ్‌గఢ్‌పై దండెత్తి రతన్‌ సేన్‌ను 1303లో ఓడించాడు. 1316లో చనిపోయాడు. ఆ కాలంలో పద్మావతి పేరుతో రాణి ఎవరూ లేరన్నది వారి వాదన. అల్లావుద్దీన్‌ మరణించిన 224 ఏళ్ల తర్వాత జాయసీ కవితలో పద్మావతి గురించి రాశాడు.

మరి దేన్ని నమ్మాలి..?
దీనిపై చరిత్రకారులు, మేధావుల్లోనే భిన్నాభిప్రాయాలున్నాయి. అసలు పద్మావతిపై మనసు పడింది అల్లావుద్దీన్‌ ఖిల్జీ కాదని, మాల్వాకు చెందిన జియాసుద్దీన్‌ ఖిల్జీ అని కొందరు చెబుతారు. 14వ శతాబ్దానికి చెందిన హమిరా మహాదేవ చరిత్రపై నయన్‌చంద్ర సూరి అనే కవి రాసిన కథే.. జాయసీ ‘పద్మావతి కథ’కు ప్రేరణ అని చెబుతారు.

ఈకథ నిజమా? కల్పితమా?
ఇలాంటి కథే లేదని, అంతా కల్పితమనేవారూ ఉన్నారు. కానీ  రాజ్‌పుత్‌లు మాత్రం నిజమని నమ్ముతారు. ముస్లిం చక్రవర్తికి లొంగకుండా ప్రాణార్పణ చేసుకున్న గొప్ప రాణిగా చిత్రీకరించేందుకే పద్మావతి పాత్రను తెరపైకి తెచ్చారని, మతాల రంగు అద్దారని ఇంకొందరి వాదన. ఇది కల్పనా? నిజమా? అన్నది అంతుచిక్కనిది.

జాయసీ చెప్పిన కథేంటి?
ఉత్తరప్రదేశ్‌లోని అవధ్‌ ప్రాంతానికి చెందిన సూఫీ సంత్‌ మాలిక్‌ మహ్మద్‌ జాయసీ 1540లో ‘పద్మావత్‌’ పేరుతో కథ రాశారు. ఆ స్టోరీ ప్రకారం.. పద్మావతి సింహళ రాకుమారి. ఆమెకు హీరామన్‌ అనే మాట్లాడే చిలుక ఉండేది. ఆమె ఎప్పుడూ ఆ చిలుకతోనే ఉండటం పద్మావతి తండ్రికి నచ్చదు. ఆ చిలుకను చంపాలని ఆదేశిస్తాడు. కానీ అది తప్పించుకుపోతుంది. చివరికి అది చితోడ్‌గఢ్‌ రాజు రతన్‌సేన్‌ చేతిలో పడుతుంది. అక్కడ ఆ చిలుక పద్మావతి అందం గురించి చెబుతుంటుంది. ఓ రోజు రతన్‌ భార్య రాణి నాగమతి ‘ మా ఇద్దరిలో (నాగమతి, పద్మావతి) ఎవరు మంచి అందగత్తో చెప్పు..’ అని అడగుతుంది. పద్మావతేనని చిలుక చెప్పగా.. ఆమెను పెళ్లాడాలనే కోరిక రతన్‌సేన్‌లో కలుగుతుంది.

పద్మావతి కోసం సింహళదేశానికి వెళ్తాడు. ఎన్నో కష్టాలు పడి చివరికి ఆమెను పెళ్లాడతాడు. తన రాజ్యానికి తెస్తాడు. తర్వాత కొద్దికాలానికి ఓ మోసానికి సంబంధించి రాఘవ్‌ చేతన్‌ అనే బ్రాహ్మణ పండితుడిని రతన్‌సేన్‌ రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు. రాజుపై కక్షతో అతడు దిల్లీ సుల్తాన్‌ అల్లావుద్దీన్‌ ఖిల్జీని కలిసి.. పద్మావతి సౌందర్యం గురించి చెబుతాడు. తర్వాత అల్లావుద్దీన్‌ చితోడ్‌ను ముట్టడించి.. పద్మావతిని అప్పగించాలని కోరతాడు. అందుకు రతన్‌సేన్‌ నిరాకరిస్తాడు. ఫలితంగా జరిగిన పోరులో రతన్‌ మరణిస్తాడు. ఈ విషయం తెలిసి నాగమతి, పద్మావతి ఆత్మార్పణం చేసుకున్నారు. సమరంలో గెలిచిన అల్లావుద్దీన్‌ ఖిల్జీ... కోటలోకి ప్రవేశించగా పద్మావతి చితాభస్మం కనిపిస్తుంది.

భన్సాలీ, దీపికా తల నరికితే 10 కోట్లు
న్యూఢిల్లీ/భరేలీ: పద్మావతి సినిమా దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ, నటి దీపికా పదుకునేల తల నరికిన వారికి రూ. 10 కోట్ల బహుమతి ఇస్తానని హరియాణా బీజేపీ చీఫ్‌ మీడియా కో–ఆర్డినేటర్‌ సూరజ్‌పాల్‌ అమూ వ్యాఖ్యానించారు. రణ్‌వీర్‌సింగ్‌ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే కాళ్లు విరగ్గొడతానన్నారు. సినిమాపై ప్రధాని మోదీ స్పందించాలన్నారు. పద్మావతి సినిమాపై దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు పెరిగాయి. ఉత్తర ప్రదేశ్‌లోని భరేలీలో అఖిల భారతీయ క్షత్రియ మహాసభ(ఏబీకేఎం) కార్యకర్తలు.. దీపికా పదుకునే, భన్సాలీల 100కు పైగా దిష్టిబొమ్మల్ని దహనం చేశారు. సినిమా విడుదలను నిషేధించాలని జిలా కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. దీపికను çసజీవంగా తగులబెట్టిన వారికి రూ. కోటి బహుమతి ఇస్తామని ఏబీకేఎం యూత్‌ నాయకుడు భువనేశ్వర్‌ సింగ్‌ ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ ‘సజీవంగా దహనమైతే ఎలా ఉంటుందో దీపికా తెలుసుకోవాలి. రాణి చేసిన త్యాగం దీపిక ఎన్నటికీ తెలుసుకోలేదు’ అని వ్యాఖ్యానించారు.

ప్రారంభం నుంచే గొడవలు
ఈ ఏడాది ప్రారంభంలో దర్శకుడు భన్సాలీ పద్మావతి సినిమా నిర్మాణాన్ని ప్రారంభించినప్పటి నుంచీ వివాదం కొనసాగుతోంది. జైపూర్‌లో సినిమా చిత్రీకరణ సమయంలో రాజ్‌పూత్‌ కర్ణి సేన భన్సాలీపై దాడి చేయడంతో పాటు సినిమా సెట్‌ను ధ్వంసం చేసింది. కొల్హాపూర్‌లోను సినిమా యూనిట్‌పై కర్ణి సేన దాడిచేసింది. భన్సాలీ,∙దీపికకు బెదిరింపులు వచ్చాయి. అక్టోబర్‌లో సినిమా మొదటి పోస్టర్‌ విడుదల కాగానే రాజపూత్‌ గ్రూపులతో పాటు, మరికొన్ని వర్గాలు.. చరిత్రను భన్సాలీ వక్రీకరించారని ఆరోపిస్తూ మళ్లీ ఆందోళనలు మొదలుపెట్టారు. గతవారం రాజస్తాన్‌ కోటాలో సినిమా టీజర్‌ను ప్రదర్శించిన థియేటర్‌పై కూడా దాడికి పాల్పడ్డారు. కాగా సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇంకా పూర్తికాకముందే ఈ సినిమా చూసేందుకు వివిధ మీడియా చానల్స్‌ను అనుమతించడాన్ని సెన్సార్‌ బోర్డు చీఫ్‌ ప్రసూన్‌ జోషి శనివారం తప్పుపట్టిన సంగతి తెలిసిందే.  

యూపీ సర్కారు షాక్‌
పద్మావతి సినిమాలోని వివాదాస్పద సన్నివేశాల్ని తొలగిస్తే తప్ప ఉత్తరప్రదేశ్‌లో సినిమాను విడుదల కానివ్వమని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వినోదపు పన్ను శాఖ మంత్రి కేశవ్‌ ప్రసాద మౌర్య మాట్లాడుతూ.. ‘ఇస్లామిక్‌ చొరబాటుదారులు దేశంలో ఎంతో విధ్వంసం సృష్టించారు. తన అభిమానాన్ని కాపాడుకునేందుకు ఒక రాణి తనను తాను సజీవంగా దహనం చేసుకుంది’ అని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top