నరిశెట్టి రాజుకు ‘ఎన్‌ఆర్‌ చందూర్‌’ అవార్డు

Nr chandhur award to the Narisetti raju - Sakshi

ఢిల్లీలో ప్రదానం చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 

సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయి మీడియా సంస్థల్లో ఉన్నతస్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న తెలుగుతేజం, ప్రముఖ జర్నలిస్టు, అమెరికాకు చెందిన గిజ్‌మోడో మీడియా గ్రూప్‌ సీఈవో నరిశెట్టి రాజు ఈ ఏడాదికిగానూ ఎన్‌ఆర్‌ చందూర్‌ జగతి పురస్కారాన్ని అందుకున్నారు. బుధవారం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడి చేతుల మీదుగా నరిశెట్టి రాజు పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ జర్నలిస్టు ఎన్‌ఆర్‌ చందూర్‌ జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు, అమరజీవి శ్రీపొట్టిశ్రీరాములు స్మారక సమితి ఏటా ఉత్తమ జర్నలిస్టులకు పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. తెనాలి పాత తాలూకాలోని చేబ్రోలుకు చెందిన నరిశెట్టి రాజు జర్నలిజంలో చేరిన కొత్తలో తెలుగు, ఆంగ్ల పత్రికల్లో పని చేశారు.

అనంతరం అమెరికాలోని డేటన్‌ డైలీ న్యూస్, వాల్‌ స్ట్రీట్‌ జర్నల్, వాషింగ్టన్‌ పోస్ట్‌ల్లో రిపోర్టర్‌ స్థాయి నుంచి మేనేజింగ్‌ ఎడిటర్‌ స్థాయికి ఎదిగారు. అనంతరం స్వదేశానికి వచ్చి మింట్‌ పత్రికను స్థాపించిన రాజు ప్రస్తుతం గిజ్‌మోడో మీడియా గ్రూప్‌కు సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తుండడంతోపాటు వికీమీడియా ఫౌండేషన్‌ బోర్డులో ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, సత్యానికి దగ్గరగా సంచలనాలకు దూరంగా విలువలతో కూడిన జర్నలిజం సమాజాభివృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. జర్నలిజంలో నరిశెట్టి రాజు రారాజుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారని, ఆయనను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పారు.

ఫోర్త్‌ ఎస్టేట్‌గా పరిగణించే మీడియా విలువలు పాటించే విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోని ముందుకెళ్లాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు సూచించారు. ‘జగతి’ మాసపత్రికను స్థాపించి 55 ఏళ్లపాటు ఎన్ని సవాళ్లు ఎదురైనా మొక్కవోని దీక్షతో నడిపి జర్నలిజానికి వన్నె తెచ్చిన వ్యక్తి ఎన్‌ఆర్‌ చందూర్‌ అని నరిశెట్టి రాజు పేర్కొన్నారు. ఆయన జ్ఞాపకార్థం ప్రదానం చేసిన ఈ అవార్డును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి చేతుల మీదుగా అందుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వెంకయ్యనాయుడు సతీమణి ఉష, కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top