నోట్ల రద్దు ముందుగానే లీకైంది | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దు ముందుగానే లీకైంది

Published Tue, Dec 20 2016 3:39 AM

నోట్ల రద్దు ముందుగానే లీకైంది

కరెన్సీ కష్టాలకు జైట్లీనే కారణం: సుబ్రహ్మణ్యస్వామి
సాక్షి ప్రతినిధి, చెన్నై: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ముందుగానే లీకైందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. కోయంబత్తూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయిందని, నోట్లు రద్దు చేయాలనే ఆలోచనే ఉంటే ముందస్తు ఏర్పాట్లు చేసి ఉండాల్సిందని చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించేందుకు ముందుగా బహిరంగ ప్రదేశాల్లో ఏటీఎంలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని, పన్నులు తగ్గించాలని సైతం తాను సూచించినట్లు తెలిపారు.

తన సూచనలను ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పట్టించుకోలేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న కరెన్సీ కష్టాలకు అరుణ్‌జైట్లీనే బాధ్యత వహించాలన్నారు. పెద్ద నోట్లు చెల్లవని కేంద్రం ప్రకటించక ముందే ఈ నిర్ణయం లీకైందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై తాను కేసులేవీ దాఖలు చేయడం లేదని, కేంద్రమే కేసు వేయాలన్నారు. అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడే కేంద్రాన్ని దుయ్యబట్టడం చర్చనీయాంశమైంది.

Advertisement
Advertisement