మోదీ.. మరోసారి

Narendra Modi As PM For Second Term Online Survey Said - Sakshi

న్యూఢిల్లీ : మోదీనే మరోసారి ప్రధానిగా ఉండాలని ఎక్కువ మంది జనాలు కోరుకుంటున్నట్లు ఆన్‌లైన్‌ సర్వేలు వెల్లడించాయి. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 63 శాతం మంది మోదీనే మరోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు సదరు సర్వే తెలిపింది. మోదీకి ఇంకో చాన్స్‌ ఇస్తే భవిష్యత్‌ బాగుంటుందని 50 శాతం మంది అభిప్రాయ పడినట్లు సదరు సర్వే వెల్లడించింది. ప్రముఖ న్యూస్‌ పోర్టల్‌ డైలీ హంట్‌, డేటా అనాలిటిక్స్‌ కంపెనీ నీల్సన్‌ ఇండియాలు ఉమ్మడిగా ఈ ఆన్‌లైన్‌ సర్వేను నిర్వహించాయి. ఈ సర్వేలో భాగంగా ఆన్‌లైన్‌లో దాదాపు 54 లక్షల మంది అభిప్రాయాలు సేకరించినట్లు తెలిసింది. మన దేశంతో పాటు విదేశాల్లో ఉంటున్న వారు కూడా ఇందులో పాల్గొన్నారని సర్వే నిర్వహకులు తెలిపారు.

2014 ఎన్నికల సమయంలో మోదీపై ఎంత నమ్మకం ఉందో ఇప్పుడు కూడా అంతే నమ్మకముందని 63 శాతం మంది అభిప్రాయపడినట్లు ఈ సర్వే వెల్లడించింది. మోదీ నాలుగేళ్ల పాలన తమకు సంతృప్తినిచ్చినట్లు సర్వేలో పాల్గొన్న వారు వెల్లడించారు. మరి కొద్ది రోజుల్లో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నిలు జరగనున్న నేపథ్యంలో ఈ సర్వేని నిర్వహించారు. కాగా ఈ ఐదు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్ ప్రజలు మోదీపై నమ్మకముంచగా.. తెలంగాణలో మాత్రం మోదీ పట్ల వ్యతిరేకత ప్రదర్శించినట్లు తెలిసింది. సర్వే నిర్వాహకులు మిజోరం గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ సర్వేను తప్పుడు సర్వేగా ఆరోపిస్తున్నాయి.మోదీ ప్రభుత్వం ప్రజల నమ్మకం కోల్పోయిందని, ఇలాంటి పనికిరాని సర్వేల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా విమర్శించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top