
ట్విస్టు: ఆనందంతో రైతు గుండె ఆగింది!
రెవెన్యూ రికార్డుల్లో తన పేరు తప్పుగా నమోదుకావడంతో దానిని సరిచేసుకోవడానికి ఆ బక్క రైతు దాదాపు 50 ఏళ్లు పోరాడాడు.
బికనీర్ (రాజస్థాన్): రెవెన్యూ రికార్డుల్లో తన పేరు తప్పుగా నమోదుకావడంతో దానిని సరిచేసుకోవడానికి ఆ బక్క రైతు దాదాపు 50 ఏళ్లు పోరాడాడు. ఎట్టకేలకు అధికారులు అతని పేరును సరిగ్గా నమోదుచేసి.. పట్టాలు జారీచేశారని కొడుకులు ఆయనకు చెప్పగానే.. ఒకింత ఆనందం ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసింది. అంతలోనే ఆయన గుండె ఆగింది. ఆనందంలోనూ విషాదం వెంటాడిన ఈ ఘటన 75 ఏళ్ల మంగిదాస్‌కు ఎదురైంది.
జైమాల్సర్ గ్రామానికి చెందిన మంగిదాస్ 20 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఆయన తండ్రి నర్సింగ్‌దాస్ చనిపోయాడు. దీంతో తండ్రి పేరిట ఉన్న నోఖా దైయాలోని 10 బైఘాస్ (రెండున్నర ఎకరాల) భూమి, జైమాల్సర్‌లోని 40బైఘాస్ (20 ఎకరాల) భూమి అతని పేరిట మార్చారు. ఇలా మారుస్తున్న క్రమంలో రికార్డుల్లో అతని పేరు మంగిదాస్‌కు బదులు మాంగ్నిదాస్ అని నమోదుచేశారు.
ఈ చిన్న తప్పును సరిచేసుకోవడానికి మంగిదాస్‌కు 50 ఏళ్లు పోరాటం చేయాల్సి వచ్చింది. రెడ్ టేపిజంతో కునారిల్లుతున్న అధికార వ్యవస్థ వల్ల అతను ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. తాజాగా రాజస్థాన్ సర్కార్ చేపట్టిన న్యాయ్ ఆప్కే ద్వార్ (న్యాయం మీ చెంతనే) కార్యక్రమంలో రెవెన్యూ రికార్డుల్లో దొర్లిన తప్పుల్ని అధికారులు తప్పుచేశారు. ఇందుకు మంగిదాస్ వేలుముద్ర కూడా తీసుకున్నారు. ఇలా సరిచేసిన పత్రాలతో కొడుకులు ఆనందంగా ఇంటికి చేరి మంగిదాస్‌కు చూపించారు. దీంతో ఆనందోద్రేకానికి గురయిన మంగిదాస్ కొంతసేపటి తర్వాత ప్రాణం విడిచాడని కొడుకులు చెప్పారు.