స్కిల్‌ ఇండియానా, నిల్‌ ఇండియానా! | Mumbai Rail Roko: Railway Trainees Explain Their Demands | Sakshi
Sakshi News home page

స్కిల్‌ ఇండియానా, నిల్‌ ఇండియానా!

Mar 21 2018 6:37 PM | Updated on Mar 21 2018 8:33 PM

Mumbai Rail Roko: Railway Trainees Explain Their Demands - Sakshi

సాక్షి, ముంబై : భారతీయ రైల్వేలో అప్రెంటీస్‌గా శిక్షణ పొందిన దాదాపు మూడు వేల మంది నిరుద్యోగ యువకులు మంగళవారం నాడు దాదాపు నాలుగు గంటలపాటు ముంబై నగరంలో రైలురోకో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఫలితంగా దాదార్, మాతుంగ రైల్వే స్టేషన్ల మధ్య లోకల్‌ రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రద్దీ ఎక్కువగా ఉండే ఉదయం ఏడు గంటల నుంచి 11 గంటల వరకు ఈ ఆందోళన కొనసాగడంతో వేలాది మంది స్కూల్‌ పిల్లలు, కాలేజీ విద్యార్థులు, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. 

ఆందోళన చేసిన వారంతా ‘ఆల్‌ ఇండియా యాక్ట్‌ అప్రెంటీస్‌ అసొసియేషన్‌’ సభ్యులు. భారతీయ రైల్వేలో తమకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ.. వారు మహారాష్ట్ర, బీహార్, పంజాబ్‌ తదితర రాష్ట్రాలన్నీ తిరుగుతున్నారు. 2014 సంవత్సరానికి ముందు భారతీయ రైల్వేలో అప్రెంటీస్‌ చేసిన వారందరికి టెక్నికల్‌ జాబ్స్‌ వచ్చేవని, 2014 నుంచి తమకు ఉద్యోగాలు రావడం లేదని వారు ఆరోపిస్తున్నారు. తాము శిక్షణ పూర్తి చేసి నాలుగైదు సంవత్సరాలు పూర్తవుతున్నా ఉద్యోగాలు ఇవ్వడానికి రైల్వే అధికారలు నిరాకరిస్తున్నారని, సిఫార్సులపై అతి కొద్ది మందికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తున్నారని బీహార్‌ నుంచి వచ్చిన నిరుద్యోగ యువకుడు సంతోష్‌ కుమార్‌ ఆరోపించారు.
 
‘సెంట్రల్‌ అప్రెంటీస్‌ యాక్ట్, 1961’ కింద రైల్వే శాఖ రెగ్యులర్‌గా అప్రెంటీస్‌లకు శిక్షణ ఇచ్చి పాసైన వారికి ఉద్యోగాలిస్తూ వస్తోంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక దానికి ‘స్కిల్‌ ఇండియా’ అంటూ ఆ నియామకాలకు పేరు పెట్టారు. కానీ నియామకాలు మాత్రం జరుగలేదు.  గత నాలుగేళ్లుగా ఉద్యోగాలు లేకపోవడంతో ఇప్పుడు వీరు ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. రెండు రోజుల్లోనే తగిన సమాధానం చెబుతామని రైల్వే శాఖ హామీ ఇవ్వడంతో నిరుద్యోగులు తమ రైల్‌రోకో ఆందోళన కార్యక్రమాన్ని విరమించారు. అయితే వారు తమకు సంతప్తికరమైన సమాధానం వస్తుందన్న విశ్వాసం లేదని వారు మీడియాకు తెలియజేశారు. 

‘గత ఆగస్టు నుంచి మేము ఢిల్లీ, గోరఖ్‌పూర్‌లలో భారీ ప్రదర్శనలు నిర్వహించాం. 30 మందికిపైగా ఎంపీలకు లేఖలు రాశాం. చివరకు రైల్వే శాఖ మంత్రిని కూడా కలుసుకున్నాం. అందరూ హామీలు ఇచ్చిన వారే. ఎవరి మాట నెరవేరలేదు’ అని ఫిట్టర్‌గా 2015లో శిక్షణ పొందిన 23 ఏళ్ల యువకుడు సంతోష్‌ కుమార్‌ వివరించారు. ‘నైపుణ్య భారత్‌’ నినాదం కింద హామీ ఇచ్చిన ఉద్యోగాలెక్కడా ? అని ఆయన ప్రశ్నించారు. ‘స్కిల్‌ ఇండియానా నిల్‌ ఇండియానా’ అని ఆందోళనకారులు విమర్శిస్తున్నారు. 

అప్రెంటీస్‌ యాక్ట్‌ అంటే ఏమిటీ?
వివిధ రకాల టెక్నికల్‌ ఇంజనీరింగ్‌ ఫీల్డ్‌లో ఇంజీనీరింగ్‌ డిప్లమో హోల్డర్లు, ఐఐటీ గ్రాడ్యువేట్లకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 1961లో అప్రెంటీస్‌ యాక్ట్‌ను తీసుకొచ్చింది. దేశంలోనే అతిపెద్ద ఉద్యోగ కల్పనా సంస్థ అవడం వల్ల భారతీయ రైల్వేలు ఇదే చట్టంలోని నిబంధనల కింద సొంత అప్రెంటీస్‌ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేసుకొంది. సొంత ఇంజనీరింగ్‌ విభాగాలు, ఎలక్ట్రిఫికేషన్, ప్రొడక్షన్‌ యూనిట్స్, లోకోమోటివ్, క్యారేజ్, వేగన్‌ షెడ్స్‌ విద్యార్థులకు అప్రెంటీస్‌ శిక్షణ ఇస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘స్కిల్‌ ఇండియా’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి దేశంలోని 16 రైల్వే జోన్లలో 30 వేల అప్రెంటీస్‌లకు శిక్షణ ఇస్తామని ఇటీవలనే కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది. 

సాధారణంగా రైల్వే విభాగాల్లో అప్రెంటీస్‌ శిక్షణ పూర్తి చేసిన వారికి రైల్వేలో లేదా ఇతర పరిశ్రమల్లో ఉద్యోగాలు చేసేందుకు వీలుగా ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ వొకేషనల్‌ ట్రేనింగ్‌’ సర్టిఫికేట్‌ను జారీ చేస్తాయి. ఈ సర్టిఫికేట్‌ సాధించిన వారందరిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ చట్టంలో నిబంధనేమీ లేదు. అయితే గత ప్రభుత్వాల హయాంలో సర్టిఫికేట్‌ సాధించిన వారికి నియామకాల్లో  ప్రాధాన్యత ఇస్తూ వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వం రైల్వేలో శిక్షణ పొందిన వారికి 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. అయినప్పటికీ ఇప్పటి వరకు నియామకాలు జరుగలేదు. అందుకే అప్రెంటీస్‌లు రైలు పట్టాలెక్కారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement