breaking news
railroko
-
స్కిల్ ఇండియానా, నిల్ ఇండియానా!
సాక్షి, ముంబై : భారతీయ రైల్వేలో అప్రెంటీస్‌గా శిక్షణ పొందిన దాదాపు మూడు వేల మంది నిరుద్యోగ యువకులు మంగళవారం నాడు దాదాపు నాలుగు గంటలపాటు ముంబై నగరంలో రైలురోకో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఫలితంగా దాదార్, మాతుంగ రైల్వే స్టేషన్ల మధ్య లోకల్ రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రద్దీ ఎక్కువగా ఉండే ఉదయం ఏడు గంటల నుంచి 11 గంటల వరకు ఈ ఆందోళన కొనసాగడంతో వేలాది మంది స్కూల్ పిల్లలు, కాలేజీ విద్యార్థులు, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆందోళన చేసిన వారంతా ‘ఆల్ ఇండియా యాక్ట్ అప్రెంటీస్ అసొసియేషన్’ సభ్యులు. భారతీయ రైల్వేలో తమకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. వారు మహారాష్ట్ర, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాలన్నీ తిరుగుతున్నారు. 2014 సంవత్సరానికి ముందు భారతీయ రైల్వేలో అప్రెంటీస్ చేసిన వారందరికి టెక్నికల్ జాబ్స్ వచ్చేవని, 2014 నుంచి తమకు ఉద్యోగాలు రావడం లేదని వారు ఆరోపిస్తున్నారు. తాము శిక్షణ పూర్తి చేసి నాలుగైదు సంవత్సరాలు పూర్తవుతున్నా ఉద్యోగాలు ఇవ్వడానికి రైల్వే అధికారలు నిరాకరిస్తున్నారని, సిఫార్సులపై అతి కొద్ది మందికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తున్నారని బీహార్ నుంచి వచ్చిన నిరుద్యోగ యువకుడు సంతోష్ కుమార్ ఆరోపించారు. ‘సెంట్రల్ అప్రెంటీస్ యాక్ట్, 1961’ కింద రైల్వే శాఖ రెగ్యులర్‌గా అప్రెంటీస్లకు శిక్షణ ఇచ్చి పాసైన వారికి ఉద్యోగాలిస్తూ వస్తోంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక దానికి ‘స్కిల్ ఇండియా’ అంటూ ఆ నియామకాలకు పేరు పెట్టారు. కానీ నియామకాలు మాత్రం జరుగలేదు. గత నాలుగేళ్లుగా ఉద్యోగాలు లేకపోవడంతో ఇప్పుడు వీరు ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. రెండు రోజుల్లోనే తగిన సమాధానం చెబుతామని రైల్వే శాఖ హామీ ఇవ్వడంతో నిరుద్యోగులు తమ రైల్‌రోకో ఆందోళన కార్యక్రమాన్ని విరమించారు. అయితే వారు తమకు సంతప్తికరమైన సమాధానం వస్తుందన్న విశ్వాసం లేదని వారు మీడియాకు తెలియజేశారు. ‘గత ఆగస్టు నుంచి మేము ఢిల్లీ, గోరఖ్‌పూర్‌లలో భారీ ప్రదర్శనలు నిర్వహించాం. 30 మందికిపైగా ఎంపీలకు లేఖలు రాశాం. చివరకు రైల్వే శాఖ మంత్రిని కూడా కలుసుకున్నాం. అందరూ హామీలు ఇచ్చిన వారే. ఎవరి మాట నెరవేరలేదు’ అని ఫిట్టర్‌గా 2015లో శిక్షణ పొందిన 23 ఏళ్ల యువకుడు సంతోష్ కుమార్ వివరించారు. ‘నైపుణ్య భారత్’ నినాదం కింద హామీ ఇచ్చిన ఉద్యోగాలెక్కడా ? అని ఆయన ప్రశ్నించారు. ‘స్కిల్ ఇండియానా నిల్ ఇండియానా’ అని ఆందోళనకారులు విమర్శిస్తున్నారు. అప్రెంటీస్ యాక్ట్ అంటే ఏమిటీ? వివిధ రకాల టెక్నికల్ ఇంజనీరింగ్ ఫీల్డ్‌లో ఇంజీనీరింగ్ డిప్లమో హోల్డర్లు, ఐఐటీ గ్రాడ్యువేట్లకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 1961లో అప్రెంటీస్ యాక్ట్‌ను తీసుకొచ్చింది. దేశంలోనే అతిపెద్ద ఉద్యోగ కల్పనా సంస్థ అవడం వల్ల భారతీయ రైల్వేలు ఇదే చట్టంలోని నిబంధనల కింద సొంత అప్రెంటీస్ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేసుకొంది. సొంత ఇంజనీరింగ్ విభాగాలు, ఎలక్ట్రిఫికేషన్, ప్రొడక్షన్ యూనిట్స్, లోకోమోటివ్, క్యారేజ్, వేగన్ షెడ్స్ విద్యార్థులకు అప్రెంటీస్ శిక్షణ ఇస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘స్కిల్ ఇండియా’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి దేశంలోని 16 రైల్వే జోన్లలో 30 వేల అప్రెంటీస్లకు శిక్షణ ఇస్తామని ఇటీవలనే కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది. సాధారణంగా రైల్వే విభాగాల్లో అప్రెంటీస్ శిక్షణ పూర్తి చేసిన వారికి రైల్వేలో లేదా ఇతర పరిశ్రమల్లో ఉద్యోగాలు చేసేందుకు వీలుగా ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రేనింగ్’ సర్టిఫికేట్‌ను జారీ చేస్తాయి. ఈ సర్టిఫికేట్ సాధించిన వారందరిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ చట్టంలో నిబంధనేమీ లేదు. అయితే గత ప్రభుత్వాల హయాంలో సర్టిఫికేట్ సాధించిన వారికి నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తూ వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వం రైల్వేలో శిక్షణ పొందిన వారికి 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. అయినప్పటికీ ఇప్పటి వరకు నియామకాలు జరుగలేదు. అందుకే అప్రెంటీస్‌లు రైలు పట్టాలెక్కారు. -
ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపాలని రైల్‌రోకో
రాయదుర్గంటౌన్ : రాయదుర్గంలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్టాపింగ్ సౌకర్యం కల్పించాలని ప్రజా సంఘాలు, బీజేపీ, బీఎస్పీ, ఆటో కార్మికుల ఆధ్వర్యంలో శనివారం రైల్‌రోకో నిర్వహించారు. స్టేషన్లో ఉదయం 10 గంటలకు గుంతకల్లు–చిక్జాజూర్ రైలును అడ్డుకున్నారు. ఈ సందర్బంగా రైల్వే యాక్షన్ కమిటీ అధ్యక్షుడు రామాంజనేయులు, బీజేపీ నాయకులు సురేష్‌కుమార్, అంభోజీరావు మాట్లాడుతూ దశాబ్దాలుగా కేవలం మూడు ప్యాసింజర్ రైళ్లను మాత్రమే నడుపుతూ రాయదుర్గం రైల్వేస్టేషన్‌ను గూడ్స్‌లకే పరిమితం చేశారన్నారు. రాయదుర్గం మీదుగా దాదాపు 10 ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నా ఒక్కదానికి కూడా స్టాపింగ్ సౌకర్యం కల్పించడం లేదన్నారు. ఇటీవల ఎంపీ దివాకర్‌రెడ్డి రాయదుర్గం స్టేషన్లో ఒకటి లేదా రెండు రైళ్లను నిలుపుదల చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినా ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదన్నారు. సరిహద్దులోని మొలకాల్మూరులో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ ఇస్తుంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మరో 15 రోజుల్లో ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలకు స్టాపింగ్ వసతి కల్పించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. దాదాపు అరగంట దాకా రైలు రోకో చేపట్టారు. అనంతరం ఎస్ఐ మహానంది, రైల్వేపోలీసులు వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించి స్టేషన్‌మాస్టర్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు. ఆటో యూనియన్ నాయకులు అనిల్‌కుమార్, అఖిల భారత కాపునాడు కార్యదర్శి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
ధర్మవరంలో రైల్ రోకో చేపట్టిన కేతిరెడ్డి
-
రైల్‌రోకో 11కి వాయిదా
సాక్షి, గుంటూరు: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కొనసాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంత నేతలు నిర్వహించ తలపెట్టిన రైల్‌రోకో వాయిదా పడింది. రంజాన్ నేపథ్యంలో తమ కార్యాచరణలో పలు మార్పులు చేసినట్లు సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ వెల్లడించింది. రాష్ట్ర విభజన నిరసన ఉద్యమాల కార్యాచరణ ప్రణాళికపై గురువారమిక్కడ సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో జేఏసీ గౌరవాధ్యక్షుడు పి.నరసింహారావు, కన్వీనర్ ఎన్.శామ్యూల్, జేఏసీ జిల్లా కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులుతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, రాతంశెట్టి రామాంజనేయులు, పోలూరి వెంకటరెడ్డి, బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, టీడీపీ తరఫున ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్ర, డాక్టర్ కోడెల శివప్రసాదరావు, కాంగ్రెస్ నేత రాయపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశం పది తీర్మానాలు చేసింది. - సీమాంధ్రకు ప్యాకేజీలు అవసరంలేదు. రాష్ట్రం సమైక్యంగానే ఉంచాలి - రాజకీయ నాయకులు రాజీనామాలు చేసి జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలుపంచుకోవాలి - చట్టబద్ధత లేని ‘ఆంటోనీ’ కమిటీని గుర్తించడంలేదని.. ఆ కమిటీని తీవ్రంగా వ్యతిరేకించాలని నిర్ణయం - మండల, నియోజకవర్గాలు, గ్రామాల వారీగా జేఏసీలు ఏర్పాటు చేయాలి - ఈ నెల పదో తేదీ నుంచి గుంటూరు మార్కెట్ సెంటర్లోని శ్రీపొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టాలి - 11న రైల్‌రోకోలు - 12న విద్యార్థులతో భారీ ర్యాలీలు - 13న గుంటూరు జిల్లావ్యాప్త బంద్, నిరసన ర్యాలీలు - కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఆంటోనీ కమిటీని బహిష్కరించాలి - అన్ని రాజకీయపార్టీలు కలసి ఉద్యమానికి మద్దతు పలకాలి