ఫలితంలేని ప్రాజెక్ట్‌ అనవసరం

Mumbai Coastal Road Should Be Scrapped - Sakshi

సాక్షి, ముంబై : ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముంబై కోస్టల్‌ రోడ్డు ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభించేందుకు సుప్రీం కోర్టు ఇటీవల అనుమతి ఇచ్చింది. అయితే ఈ విషయంలో ఎదురయ్యే కష్ట, నష్టాలను ఎదుర్కొనేందుకు కాంట్రాక్టరే సిద్ధంగా ఉండాలని చిన్న మెలికపెట్టింది. ఈ ప్రాజెక్టును ఆపేయాల్సిందిగా కోర్టుకెళ్లిన ఎన్జీవో సంస్థలు ప్రాజెక్ట్‌ వల్ల పొంచి ఉన్న ముప్పు గురించి వాదిస్తుండగా, ముంబై మున్సిపాలిటీ మాత్రం అవేమి పట్టనట్టుగా ప్రాజెక్టు పూర్తయితే నగరం పేరు ప్రఖ్యాతులు మరింత ఇనుమడిస్తాయని చెబుతోంది. సముద్రం వెంట చేపడుతున్న ఈ ప్రాజెక్ట్‌ వల్ల పర్యావరణ పరిస్థితులు దెబ్బతినడమే కాకుండా మత్స్యకారుల ఉపాధి పోతుందని, పైగా కోట్లాది రూపాయలు గంగలో పోసినట్లు అవుతుందని అవి ఆరోపిస్తున్నాయి. 

ముంబై నగరంలో మెట్రో రైలు కోసం 30 వేల కోట్ల రూపాయలు ఖర్చుకాగా, ఈ ఒక్క కోస్తా రోడ్డుకే 26 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. రైళ్లలో రోజూ ప్రయాణిస్తున్న వారిలో 1.5 శాతం మంది ప్రతిపాదిత రోడ్డుపై ప్రయాణించే అవకాశం ఉందని, అంటే రోడ్డు ఆక్యుపెన్సీ శాతం ఆరు శాతం కూడా ఉండదని, అంత తక్కువ కార్ల కోసం ఎందుకు ప్రాజెక్టును పూర్తి చేయాలని సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టర్లకు డబ్బులు కట్టబెట్టి కమీషన్ల పేరిట కోట్ల రూపాయలు కొట్టేసేందుకు పన్నిన కుట్రలో భాగమే ఈ ప్రాజెక్ట్‌ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

పైగా మార్గదర్శకాల ప్రకారం ప్రయాణికులకు యూజర్‌ చార్జీలు కిలోమీటరుకు 110 రూపాయలు పడుతుందని, అంత డబ్బు వెచ్చించి ఈ రోడ్డుపై ఎవరు వెళ్లగలరనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. లగ్జరీ కార్లలో ప్రయాణించే కొంత మంది ధనవంతుల కోసమే ఈ ప్రాజెక్టును చేపడుతున్నారని అర్థం అవుతోందని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల ఇప్పటికే ప్రభుత్వ రవాణా తగ్గిపోతూ ప్రైవేటు రవాణా పెరుగుతూ వస్తోందని, దీని వల్ల రోడ్లపై రద్దీ పెరగడమే కాకుండా వాయు కాలుష్యం మరింత పెరుగుతుందని కూడా వారు హెచ్చరిస్తున్నారు. సుప్రీం కోర్టు జోక్యం వల్ల ఇంతకాలం ఆగిన ఈ ప్రాజెక్ట్‌ను ఇంతటితోని నిలిపివేయడమే ఉత్తమ మార్గమని వారు సూచిస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top