రోజుకు 15 నిమిషాల వ్యాయామం చాలు

Minimum Exercise Is Must - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కండలు పెంచుకోవడానికి కొందరు, ఆరోగ్యంగా ఉండేందుకు మరికొందరు పోటీలు పడి జిమ్‌లకు వెళుతుంటారు. చెమటలు కక్కుతూ ప్రయాస పడి కసరత్తులు చేస్తుంటారు. ‘అమ్మో! ఆ బరువులు ఎత్తడం మనవల్ల కాదు బాబోయో! ’ ఇంకొందరు జిమ్‌కు వెళ్లాలంటేనే భయపడతారు. అలాంటి వారు ఆరోగ్యం కోసం సహజంగానే జాగింగ్‌ లేదా వాకింగ్‌ను ఎంచుకుంటారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు అంత చెమటలు కక్కాల్సిన అవసరం లేదని, అంతగా కసరత్తు చేయాల్సిన అవసరం లేదని ఓ అధ్యయనం తెలిపింది. 

కనీసం రోజుకు 13 నిమిషాల చొప్పున వారానికి 90 నిమిషాలు వ్యాయామం చేస్తే చాలట. వారి ఆయుర్దాయం మూడేళ్లు పెరుగుతుందట. అందుకోసం జిమ్‌లకు, జాగింగ్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదట. రోజుకు 13 నిమిషాలకు తగ్గకుండా వారానికి 90 నిమిషాల పాటు ఇంటి పట్టునో, రోడ్డు మీదనో వాకింగ్‌ చేస్తే, మైదానానికి వెళ్లి చిన్న చిన్న కసరత్తులు చేస్తే ఏమీ చేయని వారికన్నా మూడేళ్ల ఆయుర్దాయం పెరుగుతుందని లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆరోగ్య బీమా సంస్థ ‘వైటాలిటీ’ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. కనీస వ్యాయామం చేయని వారి నుంచి కనీస వ్యాయామం, ఎక్కువ వ్యాయామం చేసే వారి వరకు 1,40,000 మందిని ఎంపిక చేసుకొని వారి ఆరోగ్యం, ఆయుర్దాయంపై వైటాలిటీ సంస్థ కొన్నేళ్లపాటు అధ్యయనం జరిపింది. 

ఎలాంటి వ్యాయామం చేయని వారికంటే వారానికి 90 నిమిషాలు వ్యాయామం చేసిన వాళ్లు మూడేళ్లు అధికంగా, అలాగే రోజుకు 25 నిమిషాల చొప్పున వారానికి మూడు గంటలపాటు వ్యాయామం చేస్తే నాలుగేళ్లు అధికంగా జీవిస్తారట. వ్యాయామంలో మంచి ఫలితాల గురించి తెల్సి కూడా దీనికున్న ప్రాధాన్యతను కొందరు ప్రజలు ఇప్పటికీ గుర్తించరని ఈ తాజా అధ్యయనాన్ని పరిశీలించిన ‘ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ అథ్లెటిక్స్‌ ఫెడరేషన్స్‌’ అధ్యక్షుడు లార్డ్‌ సబాస్టియన్‌ కో వ్యాఖ్యానించారు. కేవలం ఆయుర్దాయం పెరగడం కోసమే కాకుండా మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు, వత్తిలో అధిక ఉత్పత్తిని సాధించేందుకు ఇది దోహదపడుతుందని ఆయన చెప్పారు. వైటాలిటీ ఆరోగ్య బీమా సంస్థ తన పాలసీదారులపైనే ఈ అధ్యయనం జరిపి, వారిలో ఆరోగ్యం కాపాడుకోవడానికి వ్యాయామం చేస్తున్న వారికి అదనపు రాయతీలను కల్పించింది. పాలసీదారులు ఎంత ఎక్కువ కాలం జీవిస్తే బీమా సంస్థకు అంత లాభాలు గదా!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top