మౌనమె నీ భాష అంటూ... | Mangalampalli Balamuralikrishna Awards Details | Sakshi
Sakshi News home page

మౌనమె నీ భాష అంటూ...

Nov 22 2016 5:50 PM | Updated on Sep 4 2017 8:49 PM

మౌనమె నీ భాష అంటూ...

మౌనమె నీ భాష అంటూ...

''మౌనమె నీ భాష ఓ మూగ మనసా''... ఈ పాట తెలుగువారందరికీ సుపరిచితం.

''మౌనమె నీ భాష ఓ మూగ మనసా''... ఈ పాట తెలుగువారందరికీ సుపరిచితం. 1979లో విడుదలైన గుప్పెడు మనసు చిత్రం కోసం ఆచార్య ఆత్రేయ రాసిన ఈ పాటను మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన తీరు అందరి హృదయాలను కట్టిపడేసింది. ఆయన ఎంతటి విద్వాంసుడో.. అంతటి ఆత్మాభిమానం కూడా కలవాడు. తన మాట చెల్లుబాటు కాదంటే అసలు తెలుగు గడ్డమీదే అడుగుపెట్టనంటూ చాలా కాలం పాటు శపథం పట్టి మరీ సొంత రాష్ట్రానికి దూరంగా చెన్నైలోనే ఉండిపోయారు. నిజానికి అక్కడకు వెళ్లిన తర్వాత ఆయనకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది కూడా. కొందరు దాన్ని గర్వం అనుకున్నా తాను లెక్క చేసేది లేదని.. తన ఆత్మాభిమానం దెబ్బతింటే తాను సహించేది లేదని చాలా సందర్భాల్లో ఆయన స్పష్టం చేశారు. అలాంటి బాలమురళీకృష్ణ లేరంటే సంగీత లోకం నమ్మలేకపోతోంది.

ఆయన అందుకున్న పలు అవార్డులు
మంగళంపల్లి బాలమురళీకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకమైన పద‍్మ శ్రీ, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ మూడు అవార్డులను అందుకున్నారు. 1976, 87లలో నేషనల్‌ ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు దక్కాయి. టీటీడీ ఆస్థాన విద్యాంసుడిగా ఆయన సేవలందించారు. తెలుగు, మలయాళం, కన్నడ, ఒరియ, హిందీ, బెంగాలి, ప్రెంచ్‌ భాషల్లో వందల సంఖ్యలో పాటలు పాడారు. 400కు పైగా సినీ గీతాలకు సంగీతమందించారు. అమెరికా, కెనడా, బ్రిటన​, రష్యా, సింగపూర్‌ సహా పలు దేశాల్లో 25 వేలకు పైగా కచేరీలు నిర్వహించి ప్రశంసలు పొందారు.   

మంగళంపల్లి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. సినీ, సంగీత ప్రపంచానికి మంగళంపల్లి మృతి తీరని లోటని ప్రముఖ దర్మకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ అన్నారు. ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌​ ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. బాలమురళీకృష‍్ణ మృతికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌​ పార్టీ సీనియర్‌ నేత, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘవీరారెడ్డి సంతాపం తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement