అతని ఇంట్లో 111 పాము పిల్లలు

Lot Of Cobra Babies Found In Orissa Former House - Sakshi

భువనేశ్వర్‌ : కొన్ని ఘటనలు మన చుట్టే జరుగుతున్న అవి బయటపడే వరకు కూడా మనకు తెలియదు. తాజాగా ఒరిస్సాలోని శ్యాంపూర్‌ గ్రామంలో జరిగిన సంఘటన ఇలాంటిదే. భుయాన్‌ అనే వ్యవసాయ కూలీ ఇంట్లో 111 పాము పిల్లలు శనివారం వెలుగుచూశాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రెండు మూడు రోజుల వయస్సు గల పాము పిల్లలు భారీ మొత్తంలో ఒకే ఇంట్లో కనబడటంతో గ్రామస్థులు భయాందోళనకు గరైనారు. అయినప్పటికి వేలాది మంది ప్రజలు అక్కడికి చేరుకుని ఆ వింతను చూడసాగారు. అటవీ అధికారులు, ఎన్‌జీవో ప్రతినిధులు అక్కడికి చేరుకుని 111 పాము పిల్లలు అక్కడికి ఎలా వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారికి అక్కడ 26 పగిలిన పాము గుడ్లు మాత్రమే కన్పించడంతో వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తల్లి పాముల గురించి వెతకడం ప్రారంభించారు. 

భుయాన్‌ తన భార్య, ఇద్దరు పిల్లలతో అదే ఇంట్లో నివాసం ఉంటున్నాడు. భుయాన్‌ ఇంట్లో నాలుగు అడుగుల ఎత్తు, రెండగుల వెడల్పుతో ఒక పాము పుట్ట ఉన్నప్పటికీ వారు దానికి పూజలు చేస్తుండేవారని తెలిసింది. అప్పుడప్పుడు పాములు కన్పించినప్పటికీ అవి తమకు హాని చేయలేదని భుయాన్‌ చెప్పాడు. అందులో ఎన్ని పాములున్నాయో తమకు తెలియదని ఆయన తెలిపాడు. పాముల సంరక్షకులు షేక్‌ మీర్జా మాట్లాడుతూ.. ‘శనివారం ఉదయం తనకు ఫోన్‌ రావడంతో అక్కడికి వెళ్లాను. నేను వెళ్లాకా అక్కడ రెండు పాము పిల్లల్ని నెలపై ఉండటం చూశాను. ఆ తర్వాత పుట్టను త్రవ్వగా పెద్ద మొత్తంలో పాము పిల్లలు బయటికొచ్చాయి. సాయంత్రం కూడా మరో రెండు నాగుపాము పిల్లలు బయటికొచ్చాయి. కానీ తల్లి పాముల అచూకీ మాత్రం కన్పించలేదు’ అని తెలిపారు.

ఈ ఘటనపై మల్లిక్‌ అనే జంతు ప్రేమికుడు మాట్లాడుతూ.. ‘ఒక పాము సాధారణంగా 20 నుంచి 40 గుడ్లు పెడుతుంది. దానిని పొదగడానికి 60 నుంచి 80 రోజుల సమయం పడుతుంది. అలా చూస్తే.. ఇక్కడ ఎన్ని పాములు ఉన్నాయి.. ఉంటే అన్ని పాములు ఒకే సారి గుడ్లు పెట్టాయా.. అన్ని ఒకే సారి పొదిగాయా.. వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ అక్కడ 26 పాము గుడ్ల అనవాళ్లు మాత్రమే లభించాయి. మిగిలిన పాము పిల్లలు ఏలా వచ్చాయి. అటవీ శాఖ అధికారులు దీనిని తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టాలి’  అని ఆయన కోరారు. అధికారులు మాత్రం అక్కడ దొరికిన పాము పిల్లల్ని జనవాసాలకు దూరంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించనున్నట్టు వెల్లడించారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top