‘జమిలి’కి లా కమిషన్‌ ఓకే

Law Commission ok to Jamili elections - Sakshi

రాజ్యాంగ సవరణలు అవసరమవుతాయి

ముసాయిదా నివేదికలో వెల్లడి

ఎన్నికల నిర్వహణకు మూడు ప్రతిపాదనలు

న్యూఢిల్లీ: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న ఎన్డీయే ప్రభుత్వ ప్రతిపాదనకు న్యాయ కమిషన్‌ మద్దతు తెలిపింది. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలని సూచించింది. దేశంలో ఏడాది పొడవునా నెలకొంటున్న ఎన్నికల వాతావరణాన్ని నిరోధించాలంటే జమిలియే మార్గమని అభిప్రాయపడింది. లా కమిషన్‌ మూడేళ్ల గడువు శుక్రవారం ముగియనున్న నేపథ్యంలో ఒకరోజు ముందు జమిలి ఎన్నికలపై ముసాయిదా నివేదికను ప్రజాక్షేత్రంలోకి విడుదల చేసింది.

ప్రభుత్వానికి కూడా ఒక ప్రతిని సమర్పించింది. ప్రస్తుత రాజ్యాంగ నిబంధనల ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని, కొన్ని సవరణలు అవసరమవుతాయని పేర్కొంది. ‘జమిలి ఎన్నికలతో ప్రజా ధనం ఆదా అవుతుంది. పాలనా, భద్రతా అధికారులపై భారం తగ్గుతుంది. ప్రభుత్వ విధానాలను మెరుగ్గా అమలుచేయడానికి వీలవుతుంది’ అని కమిషన్‌ తన నివేదికలో పేర్కొంది. లోక్‌సభ, అసెంబ్లీ(జమ్మూ కశ్మీర్‌ మినహా) ఎన్నికలను ఒకేసారి నిర్వహించడంపై అభిప్రాయాలు చెప్పాలని ప్రజలను కోరింది. జమిలి ఎన్నికల నిర్వహణకు ఉన్న మూడు అవకాశాలను సూచించింది.

మొదటి అవకాశం..
► కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ గడువును కుదించి, మరికొన్నింటి గడువును పొడిగిస్తే 2019లో లోక్‌సభతో పాటు 12 రాష్ట్రాల(తెలంగాణ, ఏపీ సహా) అసెంబ్లీలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించొచ్చు. ఇందుకోసం రాజ్యాంగంలోని నిబంధన 172కు సవరణ చేయాల్సి ఉంటుంది.

► ఇక మిగిలిన పదహారు రాష్ట్రాలకు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి 2019లో ఎన్నికలు జరపడం సాధ్యం కాదు. వాటన్నింటికి 2021 సంవత్సరంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలవుతుంది.

► అది సాకారం కావాలంటే బిహార్‌ అసెంబ్లీ గడువును 13 నెలలు పెంచాలి. కర్ణాటక అసెంబ్లీ కాలపరిమితిని 17 నెలలు కుదించాల్సి వస్తుంది.

► 2021 ఎన్నికల్లో కొలువుదీరే అసెంబ్లీల గడువు 30 నెలలు లేదా జూన్‌ 2024 వరకు(ఏది ముందైతే అది) ఉంటుంది. ఇలా అయితేనే 2024లో అన్ని అసెంబ్లీలు, లోక్‌సభకు ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు వీలవుతుంది.  

రెండో అవకాశం..
2019లో లోక్‌సభ, 12 అసెంబ్లీలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి, 2021లో మిగిలిన 16 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఒకేసారి ఎన్నికలు చేపట్టాలి. దీంతో ఐదేళ్లకోసారి రెండుసార్లు ఎన్నికలు జరుగుతాయి.

మూడో అవకాశం..
పై రెండు మార్గాల్లో జమిలి సాధ్యంకాని పక్షంలో ఒక ఏడాదిలో జరగాల్సిన ఎన్నికలన్నింటిని(అసెంబ్లీ, లోక్‌సభ) ఒకేసారి నిర్వహించాలి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top