కర్ణాటకలో రాజకీయ కాక : కేరళ కూల్‌ ట్వీట్‌

Kerala Tourism Offers Safe And Beautiful Resorts To MLAs - Sakshi

తిరువనంతపురం : అసలకే వేసవి తాపం, ఆపై కర్ణాటక ఎన్నికల ఫలితాలు. రాజకీయ నేతల్లో మరింత వేడిమి రాజుకుంది. ఉదయం నుంచి తీవ్ర ఉత్కంఠను రేపిన ఈ ఫలితాలు, చివరికి ఎవరికీ స్పష్టమైన మెజార్టీని అందించకుండా మరింత కాకను పుట్టించాయి. దీంతో కాంగ్రెస్‌, జేడీయూలు కలిసి పొత్తులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. అతిపెద్ద పార్టీగా అవతరించినందున తమను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిలవాలని బీజేపీ ఆ రాష్ట్ర గవర్నర్‌ను కోరింది. దీంతో కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఎవరికి వారు తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ తమ ఎమ్మెల్యేలకు గాలం వేయకుండా గెలిచిన ఎమ్మెల్యేలను రిసార్ట్‌లకు తరలించాలని జేడీఎస్‌ వ్యూహాం రచిస్తోంది. 

కాంగ్రెస్‌ కూడా తమ ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలిస్తోంది. ఈ రాజకీయ సమీకరణాలతో కర్ణాటక కాక పుట్టిస్తుంటే, దాని పక్కనే ఉన్న రాష్ట్రం కేరళ కర్ణాటక రాజకీయ నేతలకు వినూత్న ఆఫర్‌ ప్రకటించింది. సాక్షాత్తూ దేవుళ్ల సొంత రాష్ట్రమైన కేరళ రిసార్ట్స్‌లో బస చేసి సేద తీరండని ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తోంది. ఈ ప్రకటనతో గెలిచిన ఎమ్మెల్యేలకు బసతో పాటు తన వ్యాపార లబ్దిని చూసుకుంటోంది. తమ వద్ద అత్యంత సురక్షితమైన, అద్భుతమైన రిసార్ట్స్‌ ఉన్నాయని, ఎమ్మెల్యేలు ఇక్కడికి రావొచ్చని కేరళ టూరిజం ట్వీట్‌ చేసింది. ఇక్కడికి వచ్చి రాజకీయ గేమ్‌ ఆడుకోవాల్సిందిగా కూడా అంటోంది. కర్ణాటక రాజకీయ నేతలకు కేరళ టూరిజం ప్రకటించిన ఈ వినూత్న ఆఫర్‌కు అనూహ్య స్పందన వస్తోంది. కేరళం టూరిజం చేసిన ఈ ట్వీట్‌ ట్విటర్‌ యూజర్లను తెగ ఆకట్టుకుంటోంది. ఎన్నికల ఫలితాల సందర్భంగా చూసిన బెస్ట్‌ ట్వీట్‌ ఇదే అంటూ ఓ ట్విటర్ యూజర్‌ కామెంట్‌ పెట్టారు. గాడ్స్‌ ఓన్‌ ట్వీట్‌గా మరో యూజర్‌ కామెంట్‌ పెట్టారు. ఇలా కేరళ టూరిజం ట్వీట్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top