తుపాకీతో నిజం గొంతుకను నొక్కేశారు: కమల్
కన్నడ ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ మరణంపై తమిళ నటుడు కమల్ హాసన్ స్పందిం...
సాక్షి, చెన్నై: రాజకీయాలపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వకుండా అభిమానుల్లో గందరగోళం నెలకొల్పుతున్నారు లోక నాయకుడు కమల్ హాసన్. అయితే ప్రముఖ అంశాలపై మాత్రం నిత్యం తన ట్విట్టర్ లో స్పందిస్తూనే వస్తున్నారు. నీట్ వివాదం-అనిత సూసైడ్‌పై ట్వీట్లు చేసిన కమల్.. ఇప్పుడు ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య ఉదంతంపై స్పందించారు.
‘‘చర్చలో ఓడిపోతామన్న భయంతో తుపాకీతో నిజం గొంతుకను చంపేశారు. ఇంతకన్నా దారుణం మరోకటి లేదు. గౌరీ లంకేశ్ మరణంపై ఆమె కుటుంబ సభ్యులకు, మద్ధతుదారులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అంటూ కమల్ ఈ ఉదయం ఓ ట్వీట్ చేశారు.
'లంకేశ్ పత్రికే' అనే కన్నడ వీక్లీ టాబ్లాయిడ్‌ను ఆమె నడిపిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి మోటర్ బైక్ పై వచ్చిన దుండగులు ఆమెను కాల్చి హత్య చేసి పారిపోయారు. ఆమె హత్య వెనుక బీజేపీ, ఆరెస్సెస్ నేతల హస్తం ఉందంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించగా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆ ఆరోపణలను తిప్పి కొట్టారు. అయితే ఆమె సోదరుడు మాత్రం మావోయిస్టుల హస్తం ఉండి ఉండొచ్చన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.