గౌరీ లంకేష్‌ హత్య: పరువు నష్టం కేసులో బాంబే హైకోర్టును ఆశ్రయించిన రాహుల్‌ గాంధీ

ahul Gandhi Moves Bombay HC To Dismiss Defamation Case In Gauri Lankesh Murder - Sakshi

ముంబై: ప్రముఖ సామాజికవేత్త, సీనియర్ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ హత్యకు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ సంస్థకు(ఆర్‌ఎస్‌ఎస్‌కు) సంబంధం ఉందంటూ చేసిన వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బాంబే హైకోర్టు తలుపు తట్టారు. గౌరీ లంకేశ్‌ హత్య నేపథ్యంలో 2017లో తనపై దాఖలైన పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ  పిటిషన్‌ వేశారు. ఈ మేరకు  2019లో  బోరివరి మేజిస్ట్రేట్‌ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

సీపీఐ కార్యదర్శి సీతారాం ఏచూరితోపాటు తనను తప్పుగా ఈ కేసులో నిందితుడిగా చేర్చారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.  కాగా గౌరీ లంకేష్‌ హత్య తర్వాత సీతారాం ఏచూరి వేరే చోట, వేరే సమయంలో ప్రకటన చేశారనే విషయాన్ని ప్రస్తావించారు. 

కాగా, గౌరీ లంకేష్‌ 2017 సెప్టెంబర్ 5న బెంగళూరులోని తన ఇంటి ముందే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మతపరమైన విమర్శలు చేస్తున్నారనే భావనతో గౌరీ లంకేష్‌ను హిందూ అతివాద భావజాలం ఉన్న కొందరు  కాల్చి చంపారు.  ఈ హత్యలు జరిగిన 24 గంటల్లోనే రాహుల్‌ పార్లమెంట్‌ వెలుపల  మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడే వారెవరిపై ఒత్తిడి చేస్తారని, దాడులు జరిపి చంపేస్తారని ఆరోపించారు.

మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం ఉన్న వ్యక్తులే జర్నలిస్టును హత్య చేశారని ఏచూరి ఆరోపించారు. గౌరీ లంకేష్‌ హత్యను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో ముడిపెట్టారని ఆరోపిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త, న్యాయవాది ధృతిమాన్‌ జోషి రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, సీతారాం ఏచూరిపై ఐపీసీ సెక్షన్‌ 499, 500 ప్రకారం ఫిర్యాదు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా ప్రజల దృష్టిలో ఆర్‌ఎస్‌ఎస్‌ పరువును తగ్గించడమే అవుతుందని ఆయన పేర్కొన్నారు. 

ఈ ఫిర్యాదు ఆధారంగా 2019 ఫిబ్రవరి 18న మజ్‌గావ్‌ జిల్లా కోర్టు గాంధీతోపాటు ఏచూరికి సమన్లు జారీ చేసింది. వీరిద్దరూ 2019 జూలై 4న కోర్టుకు హాజరై బెయిల్ కోసం ప్రయత్నించారు. మరుసటి రోజే సీతారాం ఏచూరి వేర్వేరు ప్రదేశాలు, సమయాల్లో చేసిన వ్యాఖ్యలని చెబుతూ, దీనిపైఉమ్మడి విచారణ జరగడం సరికాదని అన్నారు. తనపై నమోదైన ఫిర్యాదును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు.

అయితే నవంబర్ 23, 2019న మేజిస్ట్రేట్ రాహుల్‌, ఏచూరీ పిటిషన్లను తోసిపుచ్చింది.  వ్యక్తులు వేరైనా చేసిన ప్రకటనలు ఒకటేనని, నిందితుల ఉద్ధేశం ఆర్‌ఎస్‌ఎస్‌ను కించపరడమేనని కోర్టు పేర్కొంది.  ఈ తీర్పును సవాల్‌ చేస్తూనే నేడు కాంగ్రెస్‌ నేత బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top