జేఎన్‌యూ వీసీ వెంటనే రాజీనామా చేయాలి

JNU vice chancellor should Resign, Says JNUSU - Sakshi

జేఎన్‌యూఎస్‌యూ డిమాండ్‌

న్యూఢిల్లీ: జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఆదివారం చోటుచేసుకున్న హింస నేపథ్యంలో వర్సిటీ అధికారిక విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) వీసీని టార్గెట్‌ చేసింది. క్యాంపస్‌లో జరిగిన దాడులకు జేఎన్‌యూ వీసీ జగదేశ్‌కుమార్‌ కారణమని నిందించింది. వీసీ ఒక మాబ్‌స్టెర్‌గా వ్యవహరిస్తూ యూనివర్సిటీలో హింసను ప్రేరేపిస్తున్నాడని, తన బాసులను సంతృప్తి పరిచేందుకే ఈ చర్యలను ప్రోత్సహిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆదివారం సాయంత్రం ముసుగులు ధరించి చేతిలో కర్రలతో క్యాంపస్‌లోకి చొరబడిన దుండగులు విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జేఎన్‌యూఎస్‌యూ) ప్రెసిడెంట్‌ ఆయిషీ ఘోష్‌ సహా 20మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడులకు ఏబీవీపీ విద్యార్థులే కారణమని వామపక్ష విద్యార్థి సంఘాలతో కూడిన జేఎన్‌యూఎస్‌యూ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో క్యాంపస్‌లో హింసకు వీసీ జగదేశ్‌ కారణమని, ఆయన తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని ఒక ప్రకటనలో డిమాండ్‌ చేసింది.

జేఎన్‌యూలో సబర్మతి దాబా వద్ద ఆదివారం సాయంత్రం 6.45 గంటలకు అలజడి ప్రారంభమై.. కొద్దిసేపట్లోనే మొత్తం హాస్టల్‌ అంతా హింస చెలరేగింది. ముసుగులు ధరించిన వ్యక్తులు దాడులు చేయడం, పోలీసులు రావడంతో క్యాంపస్‌ అంతా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. ఏబీవీపీ, ఆరెస్సెస్‌ గూండాలు తమపై దాడి చేసినట్టు వామపక్షవాద విద్యార్థులు ఆరోపిస్తుండగా.. ఏఐఎస్‌ఏ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులే దాడులకు దిగారని రైట్‌వింగ్‌ విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top