పుల్వామా ఘటనపై మండిపడ్డ కశ్మీర్‌ గవర్నర్‌

JK Governor Comments on Pulwama Attack - Sakshi

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌ పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమాన్ని కశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్‌ చెప్పడం దారుణమని మండిపడ్డారు. ఎన్నికలు ముగిసిన అనంతరం పాకిస్తాన్‌ నిరాశలో మునిగిపోయిందని, కొత్త ఉగ్రవాదులకు వల పన్నడం వీలు కాకపోవడం వల్లే తమ ఉనికిని చాటుకునేందుకు ఈ దారుణానికి తెగబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్‌ చెత్తగా వాగుతోంది. ఉగ్రవాదులు నిర్భయంగా ర్యాలీలు చేసుకునేందుకు అనుమతినిస్తూ, మేమైనా చేయగలమనే అహంకారంతో భారత్‌ను బహిరంగంగానే హెచ్చరించాలని చూస్తోంది’ అని వ్యాఖ్యానించారు.  తాను ఈరోజు అమర జవానుల సంస్మరణ సభకు హాజరవుతున్నానని తెలిపారు. తనతో పాటు కేంద్ర హోం మంత్రి రాజ్‌రాథ్‌ సింగ్‌ కూడా కశ్మీర్‌ వస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భద్రతా, ఇంటలెజిన్స్‌ వర్గాలతో భేటీ అయి, ఘటనకు గల కారణాల గురించి చర్చిస్తామని పేర్కొన్నారు.

కాగా గురువారం పుల్వామాలో ఉగ్రవాదులు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న ఓ బస్సు తునాతునకలు కాగా, కాన్వాయ్‌లోని పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top