నన్‌ల బదిలీ ఉత్తర్వుల నిలిపివేత 

Jalandhar Diocese Stalls Orders To Nuns Protesting Against Bishop - Sakshi

తిరువనంతపురం: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్‌ ఫ్రాంకో ములక్కల్‌పై చర్యలు తీసుకోవాలంటూ నిరసన తెలిపిన నన్‌ల బదిలీ ఉత్తర్వులను జలంధర్‌ డయోసిస్‌ నిలిపివేసింది. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తున్నందున విచారణ పూర్తయ్యే దాకా వారిని మరో చోటుకు పంపబోమంటూ హామీ ఇచ్చింది. బిషప్‌ ములక్కల్‌ 2014–16 సంవత్సరాల్లో కొట్టాయంలోని కురువింగలద్‌ కాన్వెంట్‌కు చెందిన ఓ నన్‌పై పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ బిషప్‌పై చర్యలు తీసుకోవాలంటూ గత ఏడాది బాధితురాలితోపాటు మరికొందరు నిరసన తెలిపారు. ఆందోళనకు దిగిన నలుగురు నన్‌లను వేరే ప్రాంతాలకు బదిలీ చేస్తూ మిషనరీస్‌ ఆఫ్‌ జీసస్‌కు చెందిన నన్‌ల కాంగ్రిగేషన్‌ హెడ్‌ ఉత్తర్వులు ఇచ్చారు.

ఈ విషయాన్ని బాధితులు డయాసిస్‌తోపాటు కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ దృష్టికి తీసుకెళ్లారు. తన జీవితం ప్రమాదంలో పడిందని, ఒంటరి చేసి, వేధించాలంటూ చూస్తున్నారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం వారంతా కాన్వెంట్‌ వద్ద నిరసనకు దిగగా మరికొందరు వ్యక్తులు బాధితులకు వ్యతిరేక నినాదాలు చేస్తూ అక్కడ బైఠాయించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగించారు. ఈ పరిణామాలపై స్పందించిన జలంధర్‌ డయాసిస్‌.. ఆ నలుగురు నన్‌ల బదిలీ ఉత్తర్వులను రద్దు చేసింది. బిషప్‌ ములక్కల్‌పై ఆరోపణల కేసు తేలేదాకా సిస్టర్‌ ఆల్ఫీ, సిస్టర్‌ అనుపమ, సిస్టర్‌ జోసెఫైన్, సిస్టర్‌ అన్సితలను అక్కడి నుంచి బదిలీ చేయబోమంటూ హామీ ఇచ్చింది. వారు ప్రస్తుతం పనిచేస్తున్న చోటే యథావిధిగా విధులకు హాజరు కావొచ్చని తెలిపింది.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top