కార్మికుల జీవితాలు ఎవడికి కావాలి?!

Industrial safety:Workers Lives Don't Matter - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని రెండు కర్మాగారాల్లో వారం రోజుల వ్యవధిలో సంభవించిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో 17 మంది మరణించడం, 75 మంది గాయపడడం తెల్సిందే. మహారాష్ట్ర, ధూలే జిల్లాలోని రసాయనిక ఫ్యాక్టరీలో ఆగస్టు 28వ తేదీన సంభవించిన పేలుడులో 13 మంది మరణించారు. 72 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఫ్యాక్టరీలోని కెమికల్‌ బ్యారెల్‌లో లీక్‌ ఏర్పడిన పర్యవసానంగా అగ్ని ప్రమాదం జరిగింది. ముందుగా లీకైన బ్యారెల్‌ పేలడంతో పర్యవసానంగా పక్కనే ఉన్న ఇతర బ్యారెళ్లు, నైట్రోజన్‌ సిలిండర్లు కూడా పేలిపోయాయి. పలువురు కార్మికులు ఫ్యాక్టరీ సమీపంలోనే తాత్కాలిక వసతి కల్పించడం వల్ల పేలుడు ధాటికి కార్మికుల కుటుంబ సభ్యులు కూడా మత్యువాత పడ్డారు. 

ఫ్యాక్టరీ నుంచి దుర్వాసన వస్తోందని రెండు వారాల క్రితమే స్థానికులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వారు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడంతో ఇంత ఘోరం జరిగింది. ఇక రెండో పేలుడు సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. ముంబై కోస్తా తీరంలోని చమురు, సహజ వాయువుల కార్పొరేషన్‌ ప్లాంట్‌లో పేలుడు సంభవించడంతో నలుగురు మరణించారు. ముగ్గురు గాయపడ్డారు. మరణించిన వారిలో ముగ్గురు కేంద్ర పారిశ్రామిక భద్రతా సిబ్బందికి చెందిన వారు. వారు మంటలను ఆర్పే ప్రయత్నంలో తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఈ సహజ వనరుల సంస్థ దేశంలోనే అతి పెద్దది. భారత్‌లో ఇలాంటి పారిశ్రామిక ప్రమాదాలు జరగడం సర్వ సాధారణమే. ఈ రెండు ప్రమాదాల గురించి ఈసారి మీడియాలో ఎక్కువ కవరేజీ రావడం మాత్రం అసాధారణమే. 

2014 నుంచి 2016 మధ్య రెండేళ్ల కాలంలో ఫ్యాక్టరీల్లో సంభవించిన ప్రమాదాల్లో 3,562 మంది కార్మికులు మరణించారని, 51,000 మంది గాయపడ్డారని ‘కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ’ నివేదిక తెలియజేస్తోంది. ఈ లెక్కంబడి ఫ్యాక్టరీ ప్రమాదాల్లో రోజుకు ముగ్గురు మరణిస్తుంటే, 47 మంది గాయపడుతున్నట్లు లెక్క. భారత్‌లో ఏటా వత్తిపరమైన ప్రమాదాల్లో 48 వేల మంది మరణిస్తున్నారని ‘బ్రిటీష్‌ సేఫ్టీ కౌన్సిల్‌’ 2017లో విడుదల చేసిన ఓ నివేదిక వెల్లడించింది. వారిలో 24 శాతం మంది భవన నిర్మాణ కూలీలేనని పేర్కొంది. వివిధ పరిశ్రమల్లో కార్మికుల భద్రత, ఆరోగ్య పరిరక్షణ. వారు పనిచేసే పరిస్థితులకు సంబంధించి దేశంలో ఇప్పటికే 13 చట్టాలు అమల్లో ఉన్నాయి. 

వాస్తవానికి కార్మికుల భద్రత కోసం దేశంలో ఇన్ని చట్టాలు అవసరం లేదు. ఈ చట్టాలన్నింటికీ కలిపి సమగ్రమైన చట్టం ఒక్కటి ఉన్నా, దాన్ని కచ్చితంగా అమలు చేసినా నేడు దేశంలోని ఫ్యాక్టరీలలో ఇన్ని ప్రమాదాలు జరుగుతుండేవి కావు. ప్రస్తుతమున్న 13 చట్టాలను అమలు చేసినా ఇన్ని ప్రమాదాలు జరిగేవి కావు. భారతీయ పారిశ్రామిక రంగంలో నిర్లక్ష్యం అనేది అనివార్యంగా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలోని ‘జాతీయ థర్మల్‌ విద్యుత్‌ కార్పొరేషన్‌ ప్లాంట్‌’లో 2017లో సంభవించిన పేలుడులో 32 మంది కార్మికులు మరణించారు. బాయిలర్‌ గొట్టాల (నాళాలు)ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి ఉన్నట్లయితే ఈ పేలుడు సంభవించి ఉందేది కాదని యూపీ కార్మికాభివద్ధి శాఖ ఓ నివేదికలో వెల్లడించడం ఇక్కడ గమనార్హం. 

ఢిల్లీలోని భావన పారిశ్రామిక ప్రాంతంలోని ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో గతేడాది జనవరిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 17 మంది కార్మికులు మరణించారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తప్పించుకోవడానికి అక్కడి ఫ్యాక్టరీ ప్రధాన గేట్‌ తర్వాత మరో మార్గమే లేదు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా తప్పించుకోవచ్చో రూట్‌ మ్యాప్‌గానీ, అందుకు తగ్గ ఏర్పాట్లుగానీ ఆ భవనంలో లేవు. పైగా నిబంధనలకు విరుద్ధంగా అదే భవనాన్ని బాణసంచా నిల్వ గిడ్డంగి కూడా అక్రమంగా వినియోగిస్తున్నారు. ఇలాంటి ఫ్యాక్టరీలను ఎప్పటికప్పుడు కంపెనీ ఇన్‌స్పెక్టర్లు తనిఖీ చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 

‘బ్రిటీష్‌ సేఫ్టీ కౌన్సిల్‌’ అధ్యయన నివేదిక ప్రకారం భారత్‌లో ప్రతి 506 ఫ్యాక్టరీలకు ఒక ఇన్‌స్పెక్టర్‌ చొప్పున ఉన్నారు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్వేచ్ఛా వాణిజ్య చట్టాలు కార్మిక సంఘాల చేతులు విరిచేయగా, నేటి రాజకీయాలు వాటి ఉనికినే ప్రశ్నార్థకం చేశాయి. దాంతో పరిశ్రమల యాజమాన్యాల దష్టిలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిలో, ఎప్పటికప్పుడు వారిపై ఒత్తిడి తేగల సత్తా ఉన్న ప్రజల దష్టిలో నేడు కార్మికుడి ప్రాణాలకు విలువలేకుండా పోయింది. వారి బతుకులు గాలిలో దీపాలయ్యాలి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top