ఆ ఉద్యోగాల్లో మహిళల ప్రాతినిధ్యం అంతంతమాత్రమే..!

India In Entire Women Police Count Is Seven Percentage Over Report - Sakshi

ఢిల్లీ: మహిళలకు అన్నిరంగాల్లో అధిక ప్రాధాన్యం కల్పిస్తూ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కొన్ని రంగాల్లో వారి సంఖ్య చాలా పేలవంగా ఉంది. పోలీసు, న్యాయ వ్యవస్థ వంటి కీలక విభాగాల్లో మరీ తక్కువ సంఖ్యలో ఉన్నారు. అయితే తాజాగా టాటా ట్రస్ట్స్‌ విడుదల చేసిన ‘ఇండియా జస్టిస్‌ రిపోర్టు- 2019’ నివేదికలో మహిళల ఉద్యోగాలకు సంబంధించిన పలు అంశాలు వెల్లడయ్యాయి. భారతదేశంలో 2.4 మిలియన్ల పోలీసు సిబ్బందిలో కేవలం ఏడు శాతం మహిళలు మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది. ఉన్నతస్థాయి పోలీసు ఉద్యోగాల్లో కేవలం ఆరు శాతం మంది మహిళలకు ప్రాతినిధ్యం ఉన్నట్లు వెల్లడించింది. మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా ఏడాదికి ఒక శాతం చొప్పున వారి సంఖ్యను పెంచుతున్నామని రాష్ట్రాలు చెబుతున్నప్పటికీ వారికి కేటాయించిన 33 శాతం చేరుకోవడానికి దశాబ్దాల కాలం పడుతుందని నివేదిక తేటతెల్లం చేసింది. కొన్ని రిజర్వు స్థానాల్లో భారీ సంఖ్యలో ఖాళీలు ఉండటం వల్ల మహిళల సంఖ్యతో పాటు ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీల ప్రాతినిధ్యం కూడా చాలా పేలవంగా ఉందని ఆ నివేదిక కుండబద్దలు కొట్టింది. దీంతోపాటు గత ఐదేళ్లలో దేశంలోని మొత్తం పోలీసు బలగాల్లో 6.4 శాతం మందికి మాత్రమే సరైన శిక్షణ ఇవ్వబడిందని పేర్కొంది. దేశంలో ప్రస్తుతం 90 శాతం మంది పోలీసులకు సరైన శిక్షణ లేకుండానే  విధులు నిర్వహిస్తున్నారని స్పష్టం చేసింది.

పోలీసు విభాగాల్లోనే కాకుండా న్యాయవ్యవస్థలో కూడా మహిళల ప్రాతినిధ్యం అంతంత మాత్రంగానే ఉందని ఆ నివేదిక వెల్లడించింది.  న్యాయవాదుల్లో కేవలం 18 శాతం మాత్రమే మహిళలు ఉన్నారని పేర్కొంది. దేశ వ్యాప్తంగా సబార్డినేట్‌ కోర్టుల్లో 28 మిలియన్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. 24 శాతం కేసులు ఐదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించింది. కాగా మొత్తం 2.3 మిలియన్ కేసులు పదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా 4,071 కోర్టు గదుల కొరత ఉందని పేర్కొంది. 2017 డేటా ప్రకారం ఉత్తర ప్రదేశ్‌లో పోలీసు శాఖలో 50 శాతానికి పైగా ఖాళీలు ఉన్నాయని వెల్లడించింది. భారత జైళ్ల పరిస్థితి కూడా దారుణంగా ఉందని.. దేశంలో 1,412 జైళ్లలో కేవలం 621 జైళ్లల్లో మాత్రమే సరైన సిబ్బంది ఉన్నారని వెల్లడించింది. కాగా, ఈ నివేదిక తయారిలో సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్, కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్, డీఏకేఎస్‌హెచ్‌, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ - ప్రయాస్, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ వంటి పలు ప్రతిష్టాత్మకమైన సంస్థలు భాగస్వామ్యం అయ్యాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top