
రోదిస్తున్న బంధువులు
పాడైపోయిన ఏసీ ముగ్గురు ప్రాణాలను తీసింది.
సాక్షి, చెన్నై : పాడైపోయిన ఏసీ ముగ్గురు ప్రాణాలను తీసింది. ఏసీ నుంచి వెలువడిన విషవాయువులను పీల్చడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన శరవణన్(38), అతడి భార్య కలైరాశి(30), కుమారుడు కార్తీక్(8)లు మృతిచెందినట్టు అధికారులు ప్రాథమిక విచారణలో తేలింది. తమిళనాడులోని కోయంబేడు సమీపంలోని మెట్టుకులమ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
మంగళవారం ఉదయం శరవణన్ కుటుంబసభ్యులు ఇంటి తలుపులు తీయకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు బద్దలుకొట్టి ఇంట్లోకి వెళ్లి చూడడంతో వారంతా విగతజీవులుగా కనిపించారు. సోమవారం రాత్రి విద్యుత్ పోవడంతో దంపతులు ఇన్వర్టర్ ఆన్ చేశారని ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. అర్ధరాత్రి వేళ మళ్లీ పవర్ వచ్చిందనీ, అయితే పాడైపోయిన ఏసీ నుంచి విషవాయువులు వెలువడడంతో ప్రమాదం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ కిల్‌పాక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కోయంబేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.