అంతరాయం కలిగించకండి.. ప్లీజ్‌!

End 'cycle of interruptions' in Parliament, Sumitra Mahajan writes to MPs - Sakshi

లోక్‌సభ సభ్యులకు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ లేఖ

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. గతంలో ఇతర పార్టీల సభ్యులు చేశారంటూ తమ వాదనలను సమర్ధించుకోవాలనుకుంటే అంతరాయాలు కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి వర్షాకాలం సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభ్యులకు ఆమె లేఖ రాశారు. ‘మన పార్లమెంట్, మన ప్రజాస్వామ్యం సజావుగా, ఆదర్శవంతంగా సాగాలంటే ఏం చేయాలనే దానిపై ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయింది.

ప్రజాస్వామ్యానికి ఆలయం వంటి పార్లమెంట్‌ గౌరవం, పవిత్రతను కాపాడే లక్ష్యం మనందరిదీ’ అని పేర్కొన్నారు. ‘ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటమే కాదు, దేశాభివృద్ధికి, ప్రజాస్వామ్య పటిష్టానికి మీరు కృషి చేయాల్సి ఉంటుంది’ అని తెలిపారు. సభ్యులు సభ వెల్‌లోకి దూసుకువచ్చి నినాదాలు చేయటం, ప్లకార్డులు ప్రదర్శించడాన్ని ఆమె ప్రస్తావిస్తూ..తమ అభిప్రాయాలను, డిమాండ్లను తెలిపేందుకు కొన్ని పరిమితులు, నిబంధనలు ఉంటాయన్నారు. తమ తమ నియోజకవర్గాల్లో రాజకీయ పోరు సాగిస్తూనే సభ్యులు ప్రజాస్వామ్యయుత బాధ్యతలను కూడా సభలో నెరవేర్చాల్సి ఉంటుందన్నారు.

మరో 5 భాషలకు ఛాన్స్‌
రాజ్యసభలో సభ్యులు మరో ఐదు భాషలు మాట్లాడే అవకాశం కల్పిస్తున్నట్లు రాజ్యసభ ఉపాధ్యక్షుడు వెంకయ్యనాయుడు తెలిపారు. ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాల నుంచి ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం రాజ్యాంగం 8వ షెడ్యూల్‌లో పొందుపరిచిన 22 భాషలకు గాను తెలుగు సహా 12 భాషల్లో మాట్లాడేందుకు మాత్రమే అవకాశం ఉంది. కొత్తగా డొంగ్రి, కశ్మీరీ, కొంకణి, సంథాలీ, సింధి భాషల్లో సభ్యులు మాట్లాడేందుకు వీలుగా శిక్షణ పూర్తి చేసుకుని అర్హత పొందిన అనువాదకులకు నియమించినట్లు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top