‘బ్రహ్మోస్‌’లో శత్రు గూఢచారి! | DRDO employee held for allegedly leaking BrahMos missile secrets to Pakistan | Sakshi
Sakshi News home page

‘బ్రహ్మోస్‌’లో శత్రు గూఢచారి!

Oct 9 2018 2:55 AM | Updated on Oct 9 2018 12:21 PM

DRDO employee held for allegedly leaking BrahMos missile secrets to Pakistan - Sakshi

బ్రహ్మోస్‌, నిశాంత్‌ అగ్రావాల్‌ (ఫైల్‌)

నాగ్‌పూర్‌: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి ‘బ్రహ్మోస్‌’కు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐకి చేరవేస్తున్న గూఢచారిని అధికారులు సోమవారం అరెస్ట్‌ చేశారు. నాగ్‌పూర్‌లోని డీఆర్‌డీవోలో ఉన్న ‘బ్రహ్మోస్‌ క్షిపణి పరిశోధన కేంద్రం’లో నిశాంత్‌ అగ్రవాల్‌ గత నాలుగేళ్ల నుంచి ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బ్రహ్మోస్‌ క్షిపణికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో పాటు మరికొన్ని దేశాలకు నిశాంత్‌ చేరవేసినట్లు భారత్‌ నిఘా వర్గాలు గుర్తించాయి.

దీంతో సోమవారం ఉదయం 5.30 గంటలకు నిశాంత్‌ నివాసానికి చేరుకున్న మిలటరీ ఇంటెలిజెన్స్‌ అధికారులు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ సంయుక్త బృందం అతడిని అరెస్ట్‌ చేసింది. అనంతరం సాయంత్రం వరకూ ఆ ఇంట్లో సోదాలు కొనసాగాయి. ఈ తనిఖీల్లో నిశాంత్‌ ల్యాప్‌టాప్‌లో బ్రహ్మోస్‌తో పాటు క్షిపణి వ్యవస్థలకు సంబంధించి కీలకమైన సమాచారం లభ్యమైందని ఉత్తరప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ ఐజీ అసీమ్‌ అరుణ్‌ తెలిపారు.

పక్కా సమాచారంతోనే నిశాంత్‌ ఇంటిపై దాడి చేసి అరెస్ట్‌ చేశామని వెల్లడించారు. పాకిస్తాన్‌కు చెందిన కొందరు వ్యక్తులతో నిశాంత్‌ ఫేస్‌బుక్‌ ద్వారా మాట్లాడుతున్నట్లు గుర్తించామన్నారు. నిందితుడిపై అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదుచేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతోందని అసీమ్‌ అరుణ్‌ వెల్లడించారు. రెండు నెలల క్రితం వివాహం చేసుకున్న నిశాంత్‌.. ఇక్కడి వార్ధా రోడ్డులో అద్దె ఇంటిలో ఉంటున్నాడు.

ఈ విషయమై ఇంటి యజమాని మనోహర్‌ కాలే మాట్లాడుతూ.. దాదాపు ఏడాదికాలంగా నిశాంత్‌ తమ ఇంటిలో అద్దెకు ఉంటున్నాడని తెలిపారు. అద్దెకు దిగేందుకు ఆధార్‌ కార్డు కాపీతో పాటు డీఆర్‌డీవో జారీచేసిన సర్టిఫికెట్‌ను సమర్పించాడన్నారు. ఆధార్‌ కార్డులోని వివరాల ప్రకారం ఉత్తరాఖండ్‌లోని రూర్కీ నిశాంత్‌ స్వస్థలమని వెల్లడించారు. భారత్‌కు చెందిన డీఆర్‌డీవో, రష్యాకు చెందిన మిలటరీ ఇండస్ట్రియల్‌ కన్సార్టియం(ఎన్‌పీవోఎం) సంయుక్తంగా ఏర్పాటుచేసిన బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ ‘బ్రహ్మోస్‌ క్షిపణి’ని తయారుచేసింది.

బ్రహ్మోస్‌ విశేషాలు
బ్రహ్మోస్‌ క్షిపణి తయారీ కోసం భారత్, రష్యా ప్రభుత్వాలు 1998, ఫిబ్రవరి 12న ఒప్పందం చేసుకున్నాయి. భారత్‌లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మోస్కోవా నదుల పేరు మీదుగా ఈ క్షిపణికి బ్రహ్మోస్‌ అని నామకరణం చేశారు. ఈ క్షిపణిని ట్రక్కులు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు, విమానాల ద్వారా ప్రయోగించవచ్చు. గతేడాది నవంబర్‌లో సుఖోయ్‌–30 యుద్ధవిమానం నుంచి ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. 8.4 మీటర్ల పొడవు, 3,000 కేజీల బరువున్న ఈ క్షిపణి 200 కిలోల అణ్వాయుధాలు లేదా సంప్రదాయ వార్‌హెడ్‌ను మోసుకుపోగలదు. మొబైల్‌ లాంఛర్లు, యుద్ధనౌకలు, సబ్‌మెరైన్ల ద్వారా ప్రయోగించే బ్రహ్మోస్‌ 450 కి.మీ, యుద్ధవిమానాల ద్వారా ప్రయోగించే బ్రహ్మోస్‌ 400 కి.మీ దూరంలోని లక్ష్యాలను తుత్తునియలు చేయగలదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement