
ఇంటి వద్దనే ప్రభుత్వ సేవలను అందించబోతున్న ఢిల్లీ ప్రభుత్వం
డ్రైవింగ్ లైసెన్స్, కుల ధృవీకరణ పత్రం, జనన ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు వంటి వాటికోసం ఇక ప్రభుత్వ ఆఫీసులు, రెవెన్యూ ఆఫీసుల్లో గంటల తరబడి క్యూలైన్లలో వేచిచూడాల్సినవసరం లేదట.
న్యూఢిల్లీ : డ్రైవింగ్ లైసెన్స్, కుల ధృవీకరణ పత్రం, జనన ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు వంటి వాటికోసం ఇక ప్రభుత్వ ఆఫీసులు, రెవెన్యూ ఆఫీసుల్లో గంటల తరబడి క్యూలైన్లలో వేచిచూడాల్సినవసరం లేదట. ఇక మీదట ఇలాంటి 100 రకాల ప్రజా సేవలను ఢిల్లీ ప్రభుత్వం ఇంటి వద్దనే అందించేందుకు సిద్ధమైంది. వచ్చే నెల నుంచి ఈ సేవలన్నింటిన్నీ ఇంటి వద్దనే అందించడం ప్రారంభిస్తామని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. అయితే వీటి కోసం అదనంగా 50 రూపాయల ఫీజు చెల్లించాలని ప్రభుత్వం పేర్కొంది. ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో, విజయవంతంగా పూర్తయిన ప్రతి ఒక్క లావాదేవీకి ‘ ఫెసిలిటేషన్ ఫీజు’ కింద సిటిజన్ల నుంచి 50 రూపాయలు ఛార్జ్ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రి వర్గం ప్రకటించింది. ప్రభుత్వ సేవల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఎన్నో ఇబ్బందులు పడుతుంటారని, ఈ సమస్యను తీర్చడానికి ఢిల్లీ సర్కారు ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేసే దిశగా ఈ వినూత్న సౌకర్యాన్ని ప్రారంభించబోతుంది.
ఈ విధానం వల్ల ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెరుగుతుందని, లంచాల బెడద తప్పుతుందని, ప్రజల సమయం వృథా కాదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు.ఈ పథకాన్ని ప్రైవేటు ఏజెన్సీ ద్వారా నిర్వహించనున్నారు. దీంతో ఏ ఒక్క సిటిజన్ గంటల తరబడీ క్యూ లైన్లలో వేచి చూడాల్సినవసరం లేదన్నారు. ఈ ప్లాన్ కింద మొబైల్ సహాయకస్(ఫెసిలేటర్లు)ను ఏజెన్సీ ద్వారా నియమించుకుంది. దీనికోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్లను కూడా ప్రారంభిస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు చేయాలనుకునే వారు, సంబంధిత కాల్ సెంటర్‌కు కాల్ చేసి, వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఏజెన్సీ, మొబైల్ సహాయకస్‌కు ఆ పనిని అప్పగించి, దరఖాస్తుదారుల రెసిడెన్స్‌ను సందర్శించాలని ఆదేశిస్తుంది. ఏజెన్సీ ఆదేశాలు మేరకు దరఖాస్తుదారుని ఇంటికి వెళ్లి, అవసరమైన డాక్యుమెంట్లను, వివరాలను కోరతారు. అయితే డ్రైవింగ్ టెస్ట్ కోసం దరఖాస్తుదారుడు ఒక్కసారి ఎంఎల్‌ఓ ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. దీని కోసం అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నామని గతేడాది నవంబర్‌లోనే డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చెప్పారు.